ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 20: ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు ఎదుట ఉన్న 4 చిల్లీస్ రెస్టారెంట్లో బిర్యానీలో కోడి ఈకలు వచ్చాయి. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్లారు. బిర్యానీలో కోడి ఈకలు కనిపించడంతో రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా మాట్లాడారు. దాంతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు పరీక్షల నిమిత్తం బిర్యానీ శాంపిల్‌ను సేకరించారు.
తనిఖీలు నిర్వహించగా వంటగది పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడంతో పాటు ఫ్రిజ్‌లో కుళ్లిన చికెన్, మయనీస్లు లభించాయి. రెస్టారెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో సైతం రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించకుండా చేసి ఉండడం సైతం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ ఈ రెస్టారెంట్‌పై పలు మార్లు నాణ్యతలేని ఆహారం, ఆహారంలో పలు కీటకాలు కనిపించడం వంటి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
నాణ్యతపై ప్రశ్నిస్తే రివర్స్‌లో తమనే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ అన్ని పదార్థాలకు సంబంధించిన శాంపిల్స్ సేకరించినట్లు చెప్పారు. వాటి నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.