న్యూఢిల్లీ, నవంబర్ 21 : దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈక్విటీ షేర్ల విభజన జరుగబోతున్నది. 1:5 నిష్పత్తిలో స్టాక్ సబ్-డివిజన్‌కు తమ బోర్డు ఆమోదించిందని శుక్రవారం బ్యాంక్ తెలియజేసింది. మెరుగైన లిక్విడిటీ, సరసమైన ధరల్లో షేర్లు లభించడానికే ఇదంతా అని ప్రకటించింది. కాగా, బ్యాంక్ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బోర్డు ఈ షేర్ల విభజనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ప్రస్తుతం రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతీ ఒక్క షేర్.. రూ.1 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా మారుతాయి. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ పేర్కొన్నది. తమ ఈ నిర్ణయం రిటైల్ ఇన్వెస్టర్లకు లాభిస్తుందన్న ఆశాభావాన్ని బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ సీఎస్ రాజన్ వ్యక్తం చేశారు. బ్యాంక్ ఎండీ, సీఈవో అశోక్ వాస్వానీ సైతం చిన్న మదుపరులకు అనుకూలమన్నారు.