నల్లగొండ ప్రతినిధి, నవంబర్23(నమస్తే తెలంగాణ) : డీసీసీ అధ్యక్షుల నియామకం ప్రకటన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో మంటలు రేపుతోంది. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండకు మునుగోడుకు చెందిన బీసీ నేత పున్న కైలాస్నేతను, యాదాద్రి జిల్లాకు ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్యయాదవ్ను, సూర్యాపేట జిల్లాకు తుంగతుర్తికి చెందిన ఎస్సీ నేత గుడిపాటి నర్సయ్యను అధ్యక్షులుగా ప్రకటించారు. సూర్యాపేట విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాకున్నా నల్లగొండ, యాదాద్రి జిల్లా అధ్యక్షుల నియామకంపై పార్టీలో రచ్చ కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేరుగా సీఎం రేవంత్‌రెడ్డిని, ఎంపీ రఘువీర్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ బహిరంగ విమర్శలే చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి తడిబట్టతో గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి అధ్యక్ష ఎంపికపైనా.. ఒక్కరికే మూడు పదవులు ఇవ్వడం ఏంటో? పార్టీలో ఉంటూ ప్రతిపక్షాలకు సహకరించే వారికి అధ్యక్ష స్థానం ఇవ్వడం ఏమిటో అంటూ పోత్నక్ ప్రమోద్‌కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్త చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాపై పట్టు కోసం సీఎం రేవంత్‌రెడ్డి అవకాశం దొరికిన ప్రతిసారీ చక్రం తిప్పుతూనే ఉన్నారు. గతంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో భువనగిరిలో పట్టుబట్టి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి టికెట్టు ఇప్పించుకున్నారు. నల్లగొండలో తన సన్నిహిత మిత్రుడు, తన రాజకీయ గురువు జానారెడ్డి కుమారుడైన రఘువీర్‌రెడ్డికి కట్టబెట్టారు. ఇలా ఇద్దరూ ఎంపీలు ఇప్పుడు తన కోటరిలోనూ కొనసాగుతున్నారు. ఇటీవల ఇన్చార్జి మంత్రి నియామాకంలోనూ జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలకు సంబంధం లేకుండా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను నియమించారు. తుమ్మలను కరీంనగర్‌కు ఇన్చార్జి మంత్రిగా నియమిస్తూ… జిల్లా మంత్రులకు మాత్రం ఉన్న ఇన్చార్జి మంత్రుల బాధ్యతలను చెప్పాపెట్టకుండా పీకేసారు. అప్పడే రగిలిపోయిన జిల్లా మంత్రులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. తాజాగా డీసీసీ అధ్యక్షుల ఎంపికలోనూ రేవంత్‌రెడ్డి తన మార్క్ చూపుతూ కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్ పెట్టేలా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాస్నేత ఎంపిక పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నుల్లో జరిగిందనేది స్పష్టం. యాదాద్రిలో సైతం కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులుగా ఉన్న బీసీ నేతలు పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లును పక్కపెడుతూ ఇప్పటికే రెండు కీలక పదవుల్లో ఉన్న అయిలయ్యకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం గమనార్హం. ఇది కూడా రేవంత్‌రెడ్డి జోక్యంతోనే జరిగిందని పార్టీవర్గాలు చెప్తున్నాయి.
నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాస్నేత ఎంపికలో నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డిదే కీలకపాత్ర. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో ఆయన ఈ ఎంపికలో కీలకంగా వ్యవహరించారు. అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డికి చెక్‌పెడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఝలక్ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సైతం సెగ పెట్టినట్లు అయ్యింది. మునుగోడుకే చెందిన కైలాస్నేతను డీసీసీ అధ్యక్షుడిగా చేస్తూ రాజగోపాల్‌రెడ్డికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో ఎంపీ రఘువీర్ చక్రం తిప్పారు. ఇదే సమయంలో జిల్లాలో బ్రదర్స్ ఇద్దరినీ ఒంటరిని కూడా చేసినట్లు అయ్యింది. కైలాస్నేతకు మద్దతుగా ఎంపీ రఘువీర్ మిగతా ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చారు. నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు సైతం కైలాస్నేతకే ఒకే చెప్పారు. దీంతో నల్లగొండ జిల్లాలో బ్రదర్స్‌కు రాజకీయంగా చెక్‌పెట్టడంలో కొత్తగా రఘువీర్‌రెడ్డి సక్సెస్ అయినట్లే. సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో ఎంపీ రఘువీర్‌రెడ్డి డీసీసీ ఎంపికలో కీలకంగా మారడం జిల్లా కాంగ్రెస్‌లో రానున్న కొత్త సమీకరణలు సంకేతాలన్న చర్చ మొదలైంది. ఇకముందు కూడా పార్టీపరమైన నిర్ణయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ని నామమాత్రం చేయడమే లక్ష్యమని తెలుస్తోంది.
యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్ష పదవిపై భువనగిరి నేతలు ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలుగా ఎదిగొచ్చిన పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వీరి ఆశలపై నీళ్లు చల్లుతూ అనూహ్యంగా ఇదే బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ విప్‌గా అయిలయ్య వ్యవహరిస్తున్నారు. అయినా సరే ఇతర నేతలను కాదని అయిలయ్యను ఎంపిక చేయడంపై పార్టీ సీనియర్లు గుర్రు మంటున్నారు. భువనగిరికి చెందిన ప్రమోద్‌కుమార్, వెంకటేశ్వర్లు చాలాకాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులుగా ముద్రపడ్డారు. వీరికి డీసీసీ అధ్యక్ష పీఠం అప్పజెపితే తమకే చెక్ పాయింట్స్ అవుతారని ముఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే అయిల య్య సైతం వీ రిపై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. అందుకే మధ్యేమార్గంగా అయిలయ్యను తెరపైకి తేవడంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీ చామ ల కీలకంగా వ్యవహరించిన ట్లు తెలిసిం ది. దీంతో ఒకవైపు కోమటిరెడ్డి బ్రద ర్స్ అనుచరులకు చెక్‌పెట్టడం.. మరోవైపు ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువిచ్చినట్లు అయ్యింది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పట్టున్న రెండు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపికలో సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్ రాజకీయం నడిపారు. సూర్యాపేటలో మాత్రం మంత్రి ఉత్తమ్ సూచించిన తుంగతుర్తికే చెందిన గుడిపాటి నర్సయ్యకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కిం ది. ఇక్కడ సీఎం అనుచరుడు పటేల్ రమేష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినా అవకాశం దక్కలేదు. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న నర్సయ్య తుంగతుర్తికి చెందిన వ్యక్తి కావడం.. రానున్న కాలంలో తుంగతుర్తి జనరల్ అయితే అక్కడి నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందస్తూ వ్యూహంలో నర్సయ్యకు అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు సమాచారం.
నేను రేవంత్‌రెడ్డి మనిషిని అయి ఉంటే ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యే వాడిని. ఎంపీ కొడుకునో.. ఎమ్మెల్యే కొడుకునో అయి ఉంటే ఏదో పదవి వచ్చేది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నల్లగొండకు వస్తే అన్నీ మీదేసుకుని సక్సెస్ చేశా. అప్పుడు భుజం మీద చేయి వేసి అభయమిస్తే ఏదో అనుకున్న. ఇప్పుడేమో గొంతు కోసినట్లు చేసిండు. ప్రతిసారి డీసీసీ పదవి అడిగినప్పుడల్లా మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు కావడం వల్లనే నాకు రాకుండా పోతోంది. పెద్ద నాయకులను తిట్టడం.. తీవ్రంగా విమర్శిస్తేనే పదవులు వస్తాయని మరోసారి రుజువైంది. కాంగ్రెస్‌లో వార్డు మెంబర్ కాకపోయినా డీసీసీ కావచ్చని తేలింది. కాంగ్రెస్ సిద్ధాంతం నమ్ముకున్నోళ్లని కాదని వలస నాయకులకే పెద్దపీట వేస్తున్నారు.
30 ఏండ్లుగా భువనగిరి కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్నాం. కష్టకాలంలో పార్టీ జెండా మోసాం. పార్టీ మాకు న్యాయం చేయడం లేదు. విద్యార్థి రాజకీయాల నుంచి నేటి వరకు రాజీవ్‌గాంధీ ఆశయ సాధన కోసం అంకితభావంతో పని చేస్తున్నాం. ఇప్పుడు కూడా అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఎలా.. ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. కాంగ్రెస్‌లోనే కీలక బాధ్యతల్లో ఉంటూనే ప్రతిపక్ష పార్టీలను ప్రోత్సహించే నాయకులకే పెద్దపీట వేస్తున్నారు. వలస నేతలకే పదవులు కట్టబెడుతున్నారు. మా రాజకీయ భవిష్యత్తుకు ఎవ్వరు భరోసా ఇస్తారో అర్థం కావడం లేదు.