తిరుమలగిరి నవంబర్ 22: తిరుమలగిరి మండలంలోని జలాల్పురం, నాగారం మండల పరిధిలోని మామిడిపల్లి ,ఈటూరు , వర్దమాన్కోట ,ఫణిగిరి పరిధిలోని ఎస్సారెస్పీ కాల్వలకు గండ్లు పడ్డాయి. దీనితో కాల్వ కట్టలపై నుంచి వెళ్లాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా కాల్వలకు ఇరువైపులా కంపచెట్లు అల్లుకోని దారి మూసుకుపోతోంది. రాత్రి వేళల్లో గుంతల్లో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాల్వ కట్టలపై నుంచి వెళ్లే వాహనాలు, ద్విచక్రవాహన దారులు ఎస్సారెస్పీ కాల్వల్లో పడే ప్రమాదం ఉంది.
పొంచి ఉన్న ప్రమాదం
ఎస్సారెస్పీ కాల్వ పరిధిలోని డీబీఎం 69,70,71 కాల్వల పరిధిలో కొందరు ఇష్టానుసారంగా మట్టితరలిస్తూ కాల్వ కట్టలను ధ్వంసం చేయటంతో వరదలు వచ్చి కాల్వల కట్టలకు గండ్లు పడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా కాల్వల మట్టి తరలించటంతో కొంత మంది కట్టల పరిధిలోని స్థలాలు ఆక్రమించు కోవటం వల్ల కాల్వలు చిన్నవిగా మారి దారులు మూసుకుంటున్నాయి. పై మూడు డిబీఎం ల పరిధిలో 10 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కాల్వల హద్దులు ఏర్పాటు చేయాలి
ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ తిరుమలగిరి మండల పరిధిలోని వెలిశాల నుంచ ఇ నాగారం మండల పరిధిలోని ప్రగతి నగర్ వరకు 12 కిలోమీటర్లు పొడవు ఉంది. ఈ కాల్వకు కాల్వ మధ్యలో నుంచి కుడి వైపు 34.09 మీటర్లు (114 .50ఫీట్లు ) అదే విధంగా ఎడమ వైపున 37.05 మీటర్లు (121. 55 ఫీట్లు ) మొత్తంగా కాల్వ పరిధి 70.98 మీటర్లు అంటే 232.87 ఫీట్లు ఉండాలి. కానీ చాలా చోట్ల కట్టలు ధ్వంసం చేయటంతో భూమి ఆక్రమణకు గురై కాల్వ కట్టలు చిన్నవిగా మారి గతంలో వాహనాలు ,ట్రాక్టర్లు, వెళ్లే దారి ప్రస్తుతం ద్విచక్రవాహనాలపై వెళ్లాలంటే కష్టంగా మారింది . అధికారులు వెంటనే కాల్వలకు హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కాల్వలు ధ్వంసమైతే ప్రమాదం
కాల్వలు ధ్వంసమయితే పరిస్దితి మళ్లీ ఈ ప్రాంతం కరువు ప్రాంతంగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మట్టిని తవ్వుతుంటంతో వర్షాలు వచ్చినప్పుడు కాల్వ కట్టలు కోతకు గురవుతున్నాయి లైనింగ్ దెబ్బ తింటోంది. కింది స్థాయి సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి మట్టి తరలిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సారెస్పీ కాల్వల్లో మట్టి తీయాలంటే భారీ నీటిపారుదల శాఖ ,గనులు భూగర్భ శాఖల అనుమతి తీసుకోవాలి, అయితే ఇది మచ్చుకైనా కనిపించటం లేదు. మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మట్టి తరలిస్తుండటంతో కాల్వలు ధ్వంసంమవుతున్నాయి. కాల్వలకు గండ్లు పడితే పోయటానికి మట్టి దొరకని వైనం దాపురించింది.
బీఆర్ఎస్ హయాంలోకాల్వలకు మరమ్మతులు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లు వెచ్చించి కాల్వలకు, లైనింగ్ మరమ్మతులు చేపట్టి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించింది. కాల్వల కట్టలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అధికారులు స్పందించి వెంటనే కాల్వ గట్లను ,పడిన గండ్లను పూడ్చాని రైతులు కోరుతున్నారు.

గండ్లు పూడ్చాలి
ఎస్సారెస్పీ కాల్వలకు పడిన గండ్లు వెంటనే పూడ్చాలి. లేకుంటే కాల్వలు శిథిలమై సాగునీరు అందకుండా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అధికారులు స్పందించి కాల్వల చుట్టు తిరిగి గండ్లు పడ్డ చోట వాటికి మరమ్మతులు చేయాలి. లేకుంటే కాల్వలు తెగిపోయే ప్రమాదం ఉంది. యాసంగి లోపు ప్రత్యేక నిధులు కేటాయించి కాల్వలకు మరమ్మతులు జరిగే విధంగా అధికారులు చూడాలి.
– బెల్లి నరేష్, రైతు, నాగారం బంగ్లా
త్వరలో పూడ్చేస్తాం
వర్షాలకు పడిన గండ్లను పరిశీలించాం. ఎస్టిమేషన్ వేసి నివేదిక కూడా ప్రభుత్వానికి పంపించాం. నిధులు కూడా మంజూరయ్యాయి. కొన్ని చోట్ల పనులు చేపట్టాం .యాసంగి నీటి విడుదల కంటే ముందే అన్ని మరమ్మతులు పూర్తి చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. మా పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– సత్యనారాయణ , ఎస్సారెప్పీ ఫేజ్ 2 ఈఈ