యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి కల్యాణ లక్ష్మీనరసింహస్వామి దివ్య విమానరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. జగత్ కల్యాణం.. విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా దివ్య విమాన రథోత్సవం పాంచరాత్రగమశాస్త్ర ప్రకారం వైభవంగా కొనసాగింది. వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో స్వామివారి దివ్య విమాన రథాన్ని శోభాయమానంగా అలంకరించి, విష్వక్సేనుడికి తొలి పూజలతో రథోత్సవాన్ని అరంభించారు. పట్టువస్ర్తాలు, బంగారు, వెండి, ము త్యాల అభరణాలతో కల్యాణ దంపతులైన లక్ష్మీ, నారసింహస్వామిలను దివ్య మనోహరంగా అలంకరించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య దివ్య విమాన రథంపై ఊరేగించారు.
అర్చకులు, రుత్వికులు వేద పారాయణాలు, మూలమంత్ర జట పఠనాలతో రథాంగ హోమ పూజలు నిర్వహించి, రథస్థ లక్ష్మీనారసింహస్వామికి హారతి నివేదించారు. భక్తుల జయ జయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల మధ్య ఏకశిఖర వాసుడిని విహరింపజేసే ఘట్టాలు నేత్రపర్వంగా సాగాయి. అనంతరం రథాంగరూఢుడైన లక్ష్మీనృసింహస్వామి దివ్యవిమాన రథోత్సవాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దివ్య విమాన రథోత్సవాన్ని దేవస్థాన ప్రధానార్చకులు నల్లాన్థిఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, అర్చక బృందం ఆధ్వర్యంలో పారాయణిక పరివారంతో ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు.

బ్రహ్మోత్సవ కల్యాణం మరుసటి రోజే
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజున నూతన కల్యాణమూర్తులు లక్ష్మీనృసింహస్వామి వారిని దివ్యవిమాన రథంలో ఊరేగించడం ఆలయ సంప్రదాయం. స్వామివారి రథోత్సవం రాత్రి 8.45 గంటలకు అరంభమవుతుందని దేవస్థాన అధికారులు ముందుగానే ప్రకటించారు. ఆగమశాస్త్రం ప్రకారం మూలవరులకు, ఉత్సవ మూర్తులకు రాత్రివేళ మహానివేదనలు జరిపిన ఆనంతరం రథోత్సవం నిర్వహించడం ఆచారం. మహానివేదన ఆనంతరం సేవను రథం వద్దకు తీసుకొచ్చారు. రథంపైన అధిష్టించిన స్వామి, అమ్మవార్లను భక్తుల దర్శనానంతరం రాత్రి 10 గంటలకు దివ్యవిమానరథం ప్రధానాలయ తిరుమాడవీధుల్లో నయనానందకరంగా సాగింది.
వైభవంగా గరుడ వాహనసేవ
లోక కల్యాణం, విశ్వశాంతి కోసం బ్రహ్మోత్సవ తిరుకల్యాణ లక్ష్మీనరసింహస్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. తిరుకల్యాణంలో భాగంగా సోమవారం వైభవంగా జరిగిన తిరుకల్యాణ వేడుకలతో లక్ష్మీనాథుడైన స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై దేవేరి శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సమేతంగా ఆలయ తిరువీధుల్లో ఊరేగారు. అలంకార శోభితుడు లక్ష్మీనృసింహస్వామి వేద స్వరూపుడైన వెండి గరుడ వాహనంపై అధిష్టింపజేసి వేద పండితులు, పారాయణికుల వేదమంత్రాలు, పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల మధ్య గరుడ వాహన సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది.
బ్రహ్మోత్సవ కల్యాణ నరసింహస్వామి సన్నిధిలో నిత్యహవనం, వేద పారాయణాలు నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఈవో భవానీశంకర్, డీఈవో దోర్బల భాస్కర శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టార్ సురేంద్రాచార్యులు, యాజ్ఞాచార్యులు, ముఖ్య అర్చకులు, ఉప ప్రధానార్చకులు, సహాయ కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.
నేడు చక్రతీర్ధం..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వా ర్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 7 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహిస్తారు. కొండపైన ప్రత్యేకంగా నిర్మించిన విష్ణుపుష్కరిణిలో స్వామివారి శ్రీచక్రళ్వారులకు చక్రస్నానం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు పుణ్యస్నానాలను అనుమతిఇవ్వనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టారు. విష్ణపుష్కరిణిని స్వచ్ఛమైన జలాలతో నింపారు.