ఖలీల్వాడి/ కామారెడ్డి, ఫిబ్రవరి 26: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండో సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్పు పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 335మంది పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
58 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 54 పరీక్ష కేంద్రాలను పరీక్షల నిర్వహణ కమిటీ, హైపవర్ కమిటీ బాధ్యులు, సిట్టింగ్, ఫ్లైయింగ్ స్కాడ్లు తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లాలోని 37 సెంటర్లలో మొత్తం 7,878 మందికి గాను 7,733 మంది విద్యార్థులు హాజరు కాగా 145 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్యభట్ట కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ రాజేశ్చంద్ర పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.