సారంగాపూర్/ బోధన్ రూరల్, ఫిబ్రవరి 26 : యాసంగి పంటలు సాగుచేస్తున్న రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన సమయానికి యూరియా అందకపోవడంతో వారిలో ఆవేదన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పంటకు యూరియా వేయకపోతే ఎదుగుదల ఉండదని, దీంతో దిగుబడి తక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని ముత్తకుంట సొసైటీకి బుధవారం రెండు వందల బస్తాల యూరియా వచ్చింది. సొసైటీ పరిధిలోని ఏడు గ్రామాల రైతులు గురువారం కార్యాలయానికి వచ్చారు. ఇప్పుడు ఉన్న యూరియాను సరఫరా చేస్తామని, మళ్లీ వచ్చిన అనంతరం పంపిణీ చేస్తామని కార్యాలయ సిబ్బంది తెలుపడంతో రైతులు అందుకు అంగీకరించలేదు.
యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే ఒకబస్తా మాత్రమే వస్తుందని, అది ఎందుకూ సరిపోదని రైతులు సొసైటీ సీఈవో రాముతో ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చిన రెండు వందల బస్తాలను అలాగే ఉంచి, మరో వెయ్యి బస్తాలు తెప్పించి రైతులందరికీ సరఫరా చేయాలని వారు కోరారు. కొందరు సొసైటీ వద్ద ధర్నా చేయగా.. మరికొందరు వర్ని నిజామాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎకరానికి రెండు బస్తాల యూరియా ఇవ్వాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
ప్రభుత్వం సరైన సమయంలో యూరియా సరఫరా చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధన్ మండలంలోని ఎరాస్పల్లి గ్రామ గోదాం వద్ద గురువారం ఆ గ్రామ రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పంపిణీ చేస్తున్నారో తెలియడం లేదన్నారు. యాప్ గురించి సరైన అవగాహన లేదని, తమ వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేవని, ఈ క్రమంలో యూరియా కోసం ఎలా బుక్ చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా సరఫరా చేయాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.