రామవరం, సెప్టెంబర్ 22 : సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌కే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతం పైగా కోత విధించారని, నికర లాభాల్లో కోట్లలో 34 శాతంను కార్మికులకు బోనస్‌గా ప్రకటించాలన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. మొత్తం రూ.6,394 కోట్ల లాభాలు గడిస్తే, కేవలం రూ.2,360 కోట్లలో 34 శాతం ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దసరా పండుగ పూట కార్మికులకు సీఎం రేవంత్‌రెడ్డి చేదు కబురు చెప్పారన్నారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమం.. కాంగ్రెస్ పాలనలో ఘోరమైన సంక్షోభం అంటూ ఫైర్ అయ్యారు. నమ్మి ఓటేసినందుకు సింగరేణి కార్మికులను నయ వంచన చేశారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి కార్మికుల కడుపు మీద కొట్టి తీవ్ర నిరాశకు నెట్టారు. మొత్తం లాభం రూ.6,394 కోట్ల నుండి కాకుండా, రూ.2,360 కోట్ల నుండి బోనస్ చెల్లించడం దారుణం అన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను దారుణంగా మోసం చేశారు. ఇంకా గతేడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి, బోనస్ లో సుమారు 50 శాతం వాటా కోత విధించారు. మొత్తంగా సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్ ను కూడా బోగస్ అని తెలిపారు. లాభాల వాటలో నికర లాభం నుండి సుమారు 75 శాతం కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
ఎంతో శ్రమించి సంస్థకు మంచి ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా సుమారు రూ.5 లక్షలు వస్తుందన్న కార్మికుల ఆశలను అడియాశలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ సర్కారు ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారు. కాంగ్రెస్ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గం అన్నారు.
గతేడాది సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన రూ.2,289 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు రూ.4,034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారు! గత సంవత్సరం 33 శాతం ఇవ్వగా మిగిలిన 67 శాతం ఈ సంవత్సరం ఇస్తానన్న 34 శాతం మిగిలిన 66 శాతంతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక ఒకే సంవత్సరంలో సింగరేణి సంస్థ అభివృద్ధికి అని రెండుసార్లు అమౌంట్ ని ఉంచుతున్నారు.
కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణం. కేసీఆర్ మార్గ నిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకు పోయిందని, కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారు.
సమైక్య రాష్ట్రంలో 1998-99 నుండి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 11 నుండి 16 శాతమే. అప్పుడున్న ప్రభుత్వాలు యూనియన్లు 12 సంవత్సరాలలో 6 శాతం మాత్రమే పెంచడం జరిగింది. కానీ టీబీజీకేఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 16 శాతం నుండి 32 శాతం వరకు పెంచడం జరిగింది. 10 సంవత్సరాల్లో 16 శాతం పెంచడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నికర లాభం నుండి సింగరేణి సంస్థ అభివృద్ధి గాని దాదాపు రూ.4 వేల కోట్లు పక్కన పెట్టడం జరిగింది. మరి కార్మికులకు ఇస్తున్న 34 శాతం ఇవ్వగా మిగిలిన 66 శాతం సింగరేణి సంస్థ అభివృద్ధికే కదా ? స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎంతో ఉదారతతో వ్యవహరించి ఏ రాష్ట్రం ఏర్పడినప్పుడు లేని ఇంక్రిమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. సకల జనుల సమ్మె చేసి నష్టపోయిన జీతం సింగరేణి కార్మికులకు మరల ఇవ్వడం జరిగింది. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారు.
లాభాల వాటా 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ కేసీఆర్ కే దక్కుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే సింగరేణి కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తుంది. సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభంలో 34 శాతం బోనస్‌గా ప్రకటించాలని వచ్చిన నికర లాభం నుండి 34 శాతం ఇస్తే సుమారుగా ప్రతి ఒక్క కార్మికుడికి రూ.5 లక్షల వరకు వస్తాయి. టీబీజీకేఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే టీబీజీకేఎస్, బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తుంది. దీనిలో భాగంగా రేపు అన్ని మైన్స్ ల మీద అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని ఆఫీసులలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన కార్యక్రమాన్ని చేపడతామన్నారు.