టేకులపల్లి, సెప్టెంబర్ 22 : టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం గిరిజన శాఖ నిర్వహించిన ప్రజా దర్భార్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పీఓ రాహుల్‌కు వినతి పత్రం అందజేశారు. పోరుబాట యాత్రలో భాగంగా కోయగూడెం ఆశ్రమ పాఠశాలను పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం ఇటీవలే సందర్శించింది. పరిశీలనలో అనేక సమస్యలు వెలుగులోకి రాగా వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ తెలిపారు. అధికారులు తూతు మంత్రంగా నోటీసులు ఇస్తామనే పేరుతో చేతులు దులుపుకున్నారే తప్పా ఎలాంటి పరిష్కారం చూపలేదని విమర్శించారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకుండా ఉండడం, విద్యార్థులు స్నానం చేసే వద్ద దుర్వాసన రావడం, వంటలు చేసేందుకు కట్టెలు వాడకం చేసి గ్యాస్ బిల్లులు తీసుకోవడం వంటి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
గిరిజన శాఖ నిబంధనల ప్రకారం ఎస్జీటీ, క్రాఫ్ట్, పీఈటీలకు మాత్రమే వార్డెన్ల బాధ్యతలు ఇవ్వాల్సి ఉండగా ఎక్కడా కూడా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం లకు వార్డెన్ బాధ్యతలు ఇవ్వలేదని, కానీ కేవలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో గిరిజన శాఖ నిబంధనలను తుంగలో తొక్కి కావాలనే వార్డెన్ గా నియామకం చేసి కంటిన్యూగా ఈ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎంకు మాత్రమే ఎందుకు వార్డెన్ బాధ్యతలు ఇస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన శాఖ తీసుకువచ్చిన ఉద్దీపన నిర్వహణలో భాగంగా తెలుగు పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించకుండా కాలయాపన చేస్తున్నాడని, దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. గిరిజన శాఖ నిబంధనల ఉల్లంఘనలపై ఏటీడీఓ, డీడీ అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. పీఓని కలిసిన బృందంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు మునిగెల శివ, బానోత్ నరేందర్, మోహన్ ఉన్నారు.