నాగోలు బ్రిడ్జి ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లూ కూల్చకుండా చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మధుపార్క్, హైదర్షాకోట్ ప్రాంతం మూసీ బాధితులు శనివారం సందర్శించారు. నాగోలు ప్రాంతంలో మూసీ పక్కన వాకింగ్ ట్రాక్, పార్కులు, ఓపెన్ జిమ్‌లు, సీవరేజీ ప్లాంట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. తమ ప్రాంతంలోనూ ఇలా అభివృద్ధి చేస్తే సహకరిస్తామన్నారు.
– ఎల్బీనగర్, ఫిబ్రవరి 28
మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్ పేరిట మా ఇండ్లు కూల్చకండి.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఒక్క ఇటుకా కూల్చకుండా అభివృద్ధి చేయండి.. అలా కాకుండా గృహాలను కూలుస్తామంటే ఊరుకోం.. మా ఇండ్ల జోలికి వస్తే ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటాం’ అని మూసీ బాధితులు అన్నారు. నాగోలు బ్రిడ్జి ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లూ కూల్చకుండా చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మధుపార్క్, హైదర్షాకోట్ ప్రాంతం మూసీ బాధితులు శనివారం సందర్శించారు. నాగోలు ప్రాంతంలో మూసీ పక్కన వాకింగ్ ట్రాక్, పార్కులు, ఓపెన్ జిమ్‌లు, సీవరేజీ ప్లాంట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు.
తమ ప్రాంతంలోనూ ఇలా అభివృద్ధి చేస్తే సహకరిస్తామన్నారు. ‘అలా కాకుండా రియల్ ఎస్టేట్ కోసం మా స్థలాలు లాక్కుంటామంటే ఊరుకోం’ అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగోలు బిడ్జ్ ప్రాంతంలో మూసీ నది పక్కన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి వారికి వివరించారు. నాగోలు ప్రాంతంలా అభివృద్ధి చేయకుండా ఎందుకు తమ ఇండ్లను లాక్కుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

మూసీ నది వెంట ఉన్న ఇండ్లను కూల్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. నాగోలు మూసీ ప్రాంతానికి హైదర్షాకోట్, మధుపార్క్ రిడ్జ్, డ్రీమ్ హోమ్స్, సాయిరాంనగర్ తదితర ప్రాంతాల నుంచి సుమారు వంద మంది గాంధీ సరోవర్ బాధితులు ప్లకార్డులతో నినాదాలు చేసుకుంటూ వచ్చారు. వీరికి జతగా ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి ప్రాంతానికి చెందిన మూసీ బాధితులు కూడా నాగోలు బ్రిడ్జ్ ప్రాంతానికి చేరుకుని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
– ఎల్బీనగర్, ఫిబ్రవరి 28

సీఎం అంకుల్ మా ఇంటి జోలికి రాకండి. మా ఇల్లు కూలుస్తామంటే ఎట్లా.. మేం ఊరుకోం.. అడ్డుకుంటాం. ముందు మూసీ కాలుష్యాన్ని ఆపండి. డ్రైనేజీ సిస్టం బాగు చేయండి, ఇండ్ల జోలికి రాకండి.
– అనిశా (మొదటి తరగతి, హైదర్షాకోట్)
ప్రభుత్వం గాంధీ సరోవర్, మూసీ అభివృద్ధి మా ఇండ్లు కూల్చకుండా చేయండి. నాగోలు ప్రాంతం బాగుంది. ప్రశాంతంగా ట్రాక్, పార్కులు, అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసింది.
– మౌనిక ( విఘ్నేశ్వర కాలనీ, హైదర్షాకోట్)
ప్రభుత్వం ప్రజల స్థిరాస్తిని మూసీ నది అభివృద్ధి కోసం కోరుతున్నారంటే వారి పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతున్నది. నాగోలు ప్రాంతానికి వచ్చాం. అద్భుతంగా ఉంది. ఇలాంటి అభివృద్ధిని కోరుతున్నాం.
– విశాలాక్షి, హైదర్షాకోట్, డ్రీమ్హోమ్స్

ప్రభుత్వ అనుమతులతో ఇండ్లను కొనుగోలు చేశాం. ఒక్కో ప్లాట్ నాలుగు, ఐదు సార్లు రీసేల్ అయ్యి రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మూసీ పేరు చెప్పి.. మా స్థలాన్ని కబ్జా చేయవద్దని చెబుతున్నాం. నాగోలులో అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఒక్క ఇల్లు కూల్చకుండా వాకింగ్ ట్రాక్, సివరేజీ ప్లాంట్, పార్కు చాలా బాగుంది. ఐడియల్గా ఉంది.
– వాసుదేవరావు, హైదర్షాకోట్
మా ఇల్లు కూల్చి మూసీ బాగు చేయమని గాంధీజీ చెప్పారా? ఇది మానుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి చెబుతున్నాం. ఇల్లు కూల్చుతామని చెబుతున్నారు. 30 ఏండ్లుగా ఉంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వం నాగోలులో ఎలా అభివృద్ధి చేశారో అలాగే మా ప్రాంతంలోనూ చేయాలని కోరుతున్నాం.
– సుబ్రహ్మణ్యకుమార్ (రిటైర్డ్ ఉద్యోగి, మధుపార్క్ )
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం బాగా లేదు. వారు మూసీ అభివృద్ధి అని చెప్పి మా ఇండ్లను కూలుస్తామంటే ఎట్లా? ముందు మూసీని కాలుష్యం నుంచి కాపాడండి. మూసీలో డ్రైనేజీ సిస్టం బాగు చేయాలి.
– కోట శ్రీదేవి ( చైతన్యపురి, న్యూ మారుతీనగర్)
మూసీని బాగు చేయండి. నాగోలు ప్రాంతంలో మాదిరిగా అభివృద్ధి చేయండి. కానీ మా ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు. ప్రభుత్వంతో మా డిమాండ్ ఏమిటంటే ఇది మా ఇల్లు.. మా ఇంటిని వదిలిపెట్టేది లేదు. అన్ని అనుమతులతో నిర్మించాం. మాది బఫర్‌జోన్‌లో లేదు. మేం ఇక్కడే ఉంటాం.
– మధుబాలా ( హైదర్షాకోట్)