Sharada Peetam | శారదా పీఠం భూములకూ..సర్కార్ ఎసరు!..నిర్మాణాల కూల్చివేతకు అధికారుల ఉరుకులాట
నిత్యం భూదాహంతో చెలరేగిపోతున్న రేవంత్ సర్కార్.. గత కేసీఆర్ ప్రభుత్వం శారదాపీఠానికి కేటాయించిన రెండెకరాల స్థలంపై తాజాగా కన్నేసింది.
- కేసీఆర్ హయాంలో రెండెకరాలు కేటాయింపు
- రద్దు చేస్తూ ఇటీవలి క్యాబినెట్లో నిర్ణయం
- జలమండలి రిజర్వాయర్ కోసమని బుకాయింపు
- ఎత్తయిన స్థలం ఇదేనంటూ ప్రభుత్వం సాకులు
- ఆలయ నిర్మాణాలనూ కూల్చివేసే దుస్సాహసం
- జలమండలి భూమికి ఆనుకొని తూర్పు, పడమర వైపు అందుబాటులో ఉన్న ఎత్తయిన స్థలాలు
- అయినా పీఠం భూముల స్వాధీనానికి హడావుడి
- నిర్మాణాల కూల్చివేతకు అధికారుల ఉరుకులాట
- 50 మంది పోలీసుల బందోబస్తుతో ఉదయమే శారదాపీఠం వద్దకు చేరుకున్న ఆర్డీవో, తహసీల్దార్
- విషయం తెలిసి హుటాహుటిన వెళ్లిన హరీశ్‌రావు
- క్షేత్రస్థాయిలో సర్కార్‌ను ఎండగట్టిన మాజీ మంత్రి
- ఎట్ల కూలగొడుతరో చూస్తానంటూ బైఠాయింపు
- అల్లుడి అనుచరుల క్రషర్కు పదెకరాల కేటాయింపు బాగోతాన్ని బయటపెట్టడంతో కంగుతిన్న ప్రభుత్వం
- విషయం బెడిసికొట్టి యూటర్న్ తీసుకున్న వైనం
- జరుగుతున్న పరిణామాలు తనకు చెప్పలేదంటూ అధికారులపైకి నెపం నెట్టేందుకు సీఎం ప్రయత్నం
- ముఖ్యమంత్రికి తెలియకుండానే సీఎంవో,ఐఅండ్‌పీఆర్ నుంచి ప్రకటనలు వస్తాయా?
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): నిత్యం భూదాహంతో చెలరేగిపోతున్న రేవంత్ సర్కార్.. గత కేసీఆర్ ప్రభుత్వం శారదాపీఠానికి కేటాయించిన రెండెకరాల స్థలంపై తాజాగా కన్నేసింది. ఇటీవలే మంత్రివర్గ భేటీలో నిర్ణయించిందే తడవుగా ఆ భూమిలో ఆలయ నిర్మాణాలను కూల్చివేసే దుస్సాహసానికి ఒడిగట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీశ్‌రావు క్షేత్రస్థాయికి వెళ్లి సర్కార్ కుట్రపై నిరసన గళం విప్పారు. ఇదే సమయంలో అల్లుడికి పదెకరాల భూ కేటాయింపు అంశాన్ని ఆయన బయటపెట్టారు. దీంతో అసలుకే ఎసరొస్తుందనుకొన్న ప్రభుత్వం.. శారదాపీఠం భూ కేటాయింపుల రద్దును ఉపసంహరించుకొన్నది. జలమండలికి ఆ రెండెకరాల భూకేటాయింపునూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శనివారం రోజంతా జరిగిన ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా 5 గండిపేట మండలం కోకాపేటలోని సర్వేనంబరు 240లో గత కేసీఆర్ ప్రభుత్వం రెండెకరాల భూమిని శారదా పీఠానికి కేటాయించింది. ఆ తర్వాత సర్వేనంబరు 239, 240లో సుమారు 400 ఎకరాలకు పైగా భూముల్లో కేసీఆర్ ప్రభుత్వం 2021లో నియోపొలిస్ పేరిట భారీ లేఅవుట్‌ను చేసింది. దీంతో అందులో ఎకరా రూ.100 కోట్లకు పైగా ధర పలుకడం అప్పట్లో రియల్ మార్కెట్లో సంచలనం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ లేఅవుట్‌ను మరో రెండు దశల్లో విస్తరించింది. ఈ లేఅవుట్లోనే కేసీఆర్ ప్రభుత్వం కులసంఘాలకు కేటాయించిన భూములు కూడా ఉన్నాయి.
క్యాబినెట్లో రద్దు నిర్ణయం
శారదా పీఠం నిర్వాహకులు తమకు కేటాయించిన రెండెకరాల భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకొని గత ఏడాదికాలంగా అక్కడ పీఠం ఏర్పాటు, రాజశ్యామల ఆలయ నిర్మాణాన్ని కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా ఈ రెండెకరాల కేటాయింపులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నుపడింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో శారదా పీఠానికి ఇచ్చిన ఆ రెండెకరాల భూ కేటాయింపును రద్దుచేసింది. దీంతో అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆలయ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరందుకున్నది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంతోపాటు అసలు ఎలాంటి కారణాలు లేకుండా రేవంత్‌రెడ్డి సర్కార్.. నాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన కేటాయింపును రద్దు చేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఉదయం కోకాపేటలోని శారదాపీఠం భూమి వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు, పరిసర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు.
క్షణాల్లో సర్దుబాటు ప్రకటనలు
మాజీ మంత్రి హరీశ్‌రావు కోకాపేటకు వెళ్లి మీడియాతో మాట్లాడేదే ఆలస్యం.. ప్రభుత్వం నుంచి ప్రకటనల పర్వం మొదలైంది. నియో పొలిస్ లేఅవుట్లో శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాల స్థలాన్ని ఆనుకొని జలమండలికి 8.75 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, దానిని ఆనుకొని ఓవర్‌హెడ్ ట్యాంకుకు మరో 1.18 ఎకరాలు, హెచ్ఎండీఏ సైట్ ఆఫీసుకు 0.77 ఎకరాలను కేటాయించినప్పటికీ అదనంగా భూమి కావాలని జలమండలి అభ్యర్థించినట్టుగా ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాల భూమి సముద్రమట్టానికి ఏకంగా 592 అడుగుల ఎత్తులో ఉన్నదని, అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే నగరంలోని అనేక ప్రాంతాలకు గ్రావిటీపై తాగునీటి సరఫరా జరుగుతుందని, అందుకే ఆ భూ కేటాయింపును రద్దు చేసినట్టు తెలిపి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. ఇతర చోట రిజర్వాయర్ నిర్మిస్తే పంపింగ్ కోసం కరెంటు చార్జీల భారం అవుతుందని, ఆ రెండెకరాల్లో కేటాయిస్తే మాత్రం ఆ భారం తగ్గుతుందనే రీతిలో ప్రకటనను అన్ని ప్రభుత్వ శాఖల వాట్సాప్ గ్రూపుల్లో వేసి హల్చల్ చేశారు.
సర్కార్ కుట్రపై హరీశ్ నిరసన గళం
మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం శారదా పీ ఠం నిర్మిస్తున్న రాజశ్యామల ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. రాత్రికి రాత్రి వాటిని రేవంత్ ప్రభుత్వం కూల్చివేసేందుకు కుట్ర పన్నిందని నిరసన గళం విప్పారు. దానికి సమీపంలోనే ముఖ్యమంత్రి అల్లుడికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ ఏర్పాటుతోపాటు పదెకరాల భూ కేటాయింపుల గుట్టును సైతం హరీశ్‌రావు బయటపెట్టారు. దీంతో జలమండలి రిజర్వాయర్ కోసమే శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రోజంతా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సాంకేతికంగా అంతకంటే అనువైన, ఎత్తయిన స్థలాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. దీంతో భూ కేటాయింపుల సంగతి దేవుడెరుగు.. అల్లుడి క్రషర్ బాగోతం బయటకొచ్చి విషయం బూమరాంగ్ అవుతుండటంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే సాయంత్రానికి తూచ్.. శారదాపీఠం భూ కేటాయింపుల రద్దును ఉపసంహరించుకొని, జలమండలికి ఆ రెండెకరాల కేటాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
విషయాలేవీ తెలియకుండా క్యాబినెట్లో రద్దా?
శారదా పీఠం నిర్మాణాల విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకురాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపై మండిపడినట్టుగా ప్రకటనలో పేర్కొన్నా రు. కానీ సీఎంకు తెలియకుండా భూ కేటాయింపు రద్దు జరుగుతుందా? మంత్రివర్గంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు కదా.. కానీ సీఎం తనకేమీ తెలియదన్నట్టుగా నెపాన్ని అధికారులపై నెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చుట్టూ రెండెకరాల కంటే అనువైన స్థలాలు
- జలమండలి రిజర్వాయర్ నిర్మాణానికి సాంకేతికంగా అనువైన ప్రదేశం అయినందునే శారదాపీఠం భూ కేటాయింపును
రద్దు చేసినట్టు ప్రభుత్వం సమర్థించుకోవడం ఒట్టి బూటకమని పలువురు ఇంజినీర్లు స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఈ వాదన నిజమేననిపిస్తుంది. కానీ అసలు వాస్తవాలు మరోలా ఉన్నాయి. - జలమండలికి కేటాయించిన భూమికి ఉత్తర భాగాన శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాల భూమి ఉన్నది. కానీ ఆ రెండెకరాల్లో ఇప్పటికే కీలకమైన ఆలయ నిర్మాణం, ఇతర భారీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
- జలమండలి భూమికి ఆనుకొని పడమర వైపు తెలంగాణ కౌండిన్య ట్రస్ట్‌కు కేటాయించిన ఐదెకరాల భూమి ఉన్నది. శారదా పీఠం రెండెకరాలకు, ఈ భూమికి ఎత్తులో ఎలాంటి తేడా లేదు. పైగా ఆ ఐదు ఎకరాల భూమిలో ఎలాంటి నిర్మాణాలు లేకపోగా, కనీసం ప్రహరీ కూడా లేదు. అంటే ప్రభుత్వం ఆ ట్రస్టు నిర్వాహకులకు నచ్చజెప్పి అందులో రెండు ఎకరాలను తీసుకుంటే సరిపోతుంది.
- జలమండలి భూమికి తూర్పు వైపున నాలుగు ఎకరాల ఓపెన్ స్పేస్ (అంటే ప్రజా ప్రయోజనాలకు కేటాయించిన భూమి) ఉన్నది. మధ్యలో కేవలం 45 మీటర్ల వెడల్పు రోడ్డు మాత్రమే ఉన్నది. పైగా ఆ నాలుగెకరాల భూమి శారదా పీఠం.. రెండెకరాల భూమి కంటే ఎత్తులోనే ఉన్నది. అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుంది.
- జలమండలి భూమికి ఆనుకొని దక్షిణం వైపున లేఅవుట్లో భాగంగా భవిష్యత్తులో విస్తరణ కోసం అంటూ 15.87 ఎకరాల భూమిని కేటాయించారు. దీంతోపాటు మరో 1.50 ఎకరాలను గోల్కొండ ఎడ్యుకేషనల్ సొసైటీ కోసమని ప్రతిపాదించారు. వీటిల్లో ఎలాంటి నిర్మాణాలు లేవు. కాకుంటే శారదా పీఠం రెండెకరాల కంటే ఈ భూములు కొంత తక్కువ ఎత్తులో ఉన్నాయి. అయితే జలమండలికి కేటాయించిన 8.75, 1.18 ఎకరాల భూములు ఎలాగూ శారదా పీఠం రెండెకరాల ఎత్తులో ఉన్నందున అక్కడ అనువైన ప్రదేశంలో రిజర్వాయర్ నిర్మించి, ఇతర పంపుహౌస్‌లు, శుద్ధి కేంద్రాలు,
కార్యాలయాల కోసం తక్కువ ఎత్తులో ఉన్న 15.87 ఎకరాలు, 1.50 ఎకరాల్లో అవసరమైన మేర వాడుకుంటే సరిపోతుంది. - ఇవన్నీ కాకుండా పక్కనే ఇస్లామిక్ స్టడీస్ సెంటర్ కోసం పదెకరాలను కేటాయించారు. కానీ సంబంధిత బాధ్యులు తమకు ఇక్కడ కాకుండా పాతబస్తీలో భూమిని కేటాయించాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. ఈ పదెకరాల భూమి శారదా పీఠం భూమి కంటే ఇంకా ఎత్తులో ఉన్నది. అందులో రెండెకరాలను తీసుకున్నా సరిపోతుంది.
- మరి.. ప్రభుత్వం వీటిని పరిశీలించకుండా కేవలం జలమండలి రిజర్వాయర్ నిర్మాణ కోసమంటూ శారదా పీఠం భూ కేటాయింపును రద్దు చేసి..
నిర్మాణాలను కూల్చివేసేందుకు సిద్ధమైందంటే.. వేరే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు బాటలోనే ఈ రద్దు నిర్ణయమా?
ఆంధ్రప్రదేశ్‌లోనూ శారదా పీఠానికి 2021లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. విశాఖ పరిధిలోని భీమిలి పట్టణాన్ని ఆనుకొని కొత్తవలస గ్రామ పరిధిలో ఈ భూమి కేటాయించారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం నెలల వ్యవధిలోనే ఆ భూ కేటాయింపును రద్దు చేసింది. ఈ సమయంలో టీడీపీ అనుకూల పత్రికల అన్నింటిలోనూ జగన్ రాజగురువు స్వరూపానందేంద్ర స్వామికి అడ్డగోలుగా కేటాయించిన భూములను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసినట్టుగా కథనాలు ఇచ్చారు. అంటే అక్కడ వైసీపీని బూచిగా చూపి పీఠానికి చేసిన భూ కేటాయింపులను రద్దు చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీకి అనుకూలం, టీడీపీకి వ్యతిరేకమైనందునే కోకాపేటలో కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఆ రెండెకరాల భూ కేటాయింపులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. నియోపొలిస్ లేఅవుట్ వ్యూ పాయింట్ అత్యధిక ఎత్తయిన ప్రదేశమే సముద్ర మట్టానికి 583 అడుగులుగా గూగుల్‌లో స్పష్టంగా ఉన్నది. కానీ శనివారం ప్రభుత్వ ప్రకటనలో శారదా పీఠం రెండెకరాల భూమి సముద్రమట్టానికి ఏకంగా 592 అడుగుల ఎత్తులో ఉన్నదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

