న్యూయార్క్ : డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నొప్పి నివారణకు వాడే టైలినాల్ ట్యాబ్లెట్ల వినియోగంపై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకుంటారని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రెగ్నెంట్ మహిళలు టైలినాల్ ట్యాబ్లెట్ల వాడకం గురించి ట్రంప్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కేవలం తీవ్ర జ్వరం ఉన్న సమయంలోనే మాత్రమే టైలినాల్ మాత్రలను వాడాలని ట్రంప్ సూచన చేసే అవకాశం ఉన్నది. టైలినాల్ను ఇతర దేశాల్లో పారాసిటమాల్ మందుతో పోల్చుతారు. ఆదివారం జరిగిన ఛార్లీ కిర్క్ జ్ఞాపకార్థ సమావేశంలో మాట్లాడుతూ ఆటిజం గురించి కీలక ప్రకటన చేయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఆయన టైలినాల్ వినియోగంపై ప్రకటన చేస్తారని అమెరికా మీడియా అంచనా వేస్తున్నది. టైలినాల్కు… ఆటిజంకు సంబంధం ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఆ డ్రగ్ వల్ల ఆటిజం వస్తుందనడానికి ఆధారాలు లేవని కొందరు నిపుణులు అంటున్నారు.
పెయిన్ రిలీఫ్‌కు టైలినాల్ పాపులర్ బ్రాండ్. అమెరికా, కెనడాతో ఉత్తర అమెరికా దేశాల్లో ఈ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతుంటారు. దీంట్లో ప్రధానంగా అసిటమినోఫిన్ ఉంటుంది. దీన్నే ఇతర దేశాల్లో పారసిటమాల్గా పిలుస్తారు. టైలినాల్ మందును కెన్వ్యూ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. అయితే టైలినాల్తో ప్రెగ్నెంట్ మహిళల్లో ఎటువంటి సమస్యలు లేవని మాత్రం ఆ సంస్థ చెబుతున్నది. కానీ ట్రంప్ ఎటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేశారో వేచి చూడాల్సిందే.