రామగిరి, సెప్టెంబర్ 22 : నల్లగొండ కొమలి కళా సమితికి చెందిన ప్రముఖ నటుడు, కళాకారుడు మంచిరాజు లక్ష్మీనరసింహరావు నాటకరత్న తెలంగాణ ఐకాన్ జాతీయ పురస్కారం అందుకున్నారు. వసుందర విజ్ఞాన మండలి సామాజిక సాంస్కృతిక, చైతన్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. నరసింహరావు ఇప్పటికే నాటకరంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలతో పాటు కోమటి కళా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన నాటకాలకు నంది అవార్డులు దక్కించుకున్నారు.
ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మధుకర్ వైద్యుల, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహ్మరెడ్డి, సాహిత్య అకాడమి కార్యదర్శి నామోజు బాలాచారి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా ఆయన పురస్కారం స్వీకరించారు. కోమలి కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బక్కా పిచ్చయ్య, పోశం రఘుపతి, జిల్లా కళాకారులు లక్ష్మీనరసింహరావుకు శుభాకాంక్షలు తెలిపారు.