మధిర, సెప్టెంబర్ 22 : మధిర నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సీపీఎం పార్టీ బృందం ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధిరలో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి రెండు సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. రాజకీయ కారణాల వల్లే ఈ ఆస్పత్రిని ప్రారంభించడం లేదని, దీనిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి ఇంకా నిరుపయోగంగానే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త ఆస్పత్రిని ప్రారంభించక పోవడం వల్ల పాత ఆస్పత్రిని కూడా పట్టించుకోవడం లేదన్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చిన్న అనారోగ్యానికైనా ఖమ్మం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్త ఆస్పత్రిని ప్రారంభించకపోతే భవిష్యత్లో ప్రజలను సమీకరించి ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, పట్టణ కార్యదర్శి పడకండి మురళి, నాయకులు అనుమోలు భాస్కరరావు, తేలబ్రోలు రాధాకృష్ణ, పెంటి వెంకటరావు పాల్గొన్నారు.