సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఆస్తులను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ కోసం 450 కుటుంబాలున్న మధు పార్క్ రిడ్జ్ను ఖాళీ చేయాలని వచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఆయన ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లి అక్కడి నివాసితులకు భరోసా కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ అపార్ట్మెంట్ నివాసితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న విధ్వంసాన్ని అడ్డుకుని తీరుతామని హామీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునే దాకా పోరాటాలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు బాధితుల పక్షాన నిలబడి కొట్లాడతారన్నారు. మధు పార్క్ రిడ్జ్‌తో పాటు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొన్న బాధితులందరి పక్షాన రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పట్టుబడతామన్నారు. ప్రభుత్వం దిగివచ్చే దాకా అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. అపార్ట్మెంట్ వాసులు ఎలాంటి భయాందోళనలు చెందకుండా ఉండాలని పిలుపునిచ్చారు. మూసీని శుద్ధి చేయడానికి బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాదని, దాని సాకుతో పేదల భూములు, ఇండ్లను చెరబడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

కేసీఆర్ మళ్లీ వస్తేనే మాకు రక్షణ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని మధు పార్క్ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లను కూల్చి, భూములను లాక్కొని విగ్రహం కట్టాలని గాంధీ మహాత్ముడు కోరుకోరని స్పష్టం చేశారు. గాంధీ అహింసామార్గాన్ని అనుసరిస్తే.. ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్న కాంగ్రెస్ పార్టీ హింసా మార్గంలో ప్రజలను వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కొట్టి వ్యాపారులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా జీవిస్తారని అన్నారు. కేసీఆర్ వస్తేనే హైదరాబాద్ ప్రజలకు రక్షణ ఉంటుందని అన్నారు. కేసీఆర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మారిస్తే.. రేవంత్‌రెడ్డి పాతాలానికి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వస్తేనే నగర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారని అభిప్రాయపడ్డారు. ‘కం బ్యాక్ కేసీఆర్.. కం బ్యాక్ కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
కాంగ్రెస్ సర్కారుకు మానవత్వం లేదు

మధు పార్క్ అపార్ట్మెంట్ నివాసితులు బాధలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. మీడియా ముందు తమ ఆవేదన చెప్పుకొంటూ రోదిస్తుంటే భావోద్వేగం ఆపులేకపోతున్నా. తమ ఇండ్లను ఖాళీ చేయబోమంటున్న ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే చలించిపోయాను. పది రూపాయలతో నీళ్లల్లో విషం కలిపి తమను చంపేసి అపార్ట్‌మెంట్‌ను తీసుకోవాలని ఆవేదన చెందిన ఓ తల్లి బాధ కంట తడి పెట్టించింది. కాంగ్రెస్ ప్రభుతానికి కొంచమైనా మానవత్వం లేదు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కూడా మూసీ శుద్ధీకరణకు ఎన్నో పనులు చేపట్టాం. అప్పులు చేసి కట్టుకున్న పేదల ఇండ్లు మూసీలో మునిగిపోకుండా ఉండాలని కేసీఆర్ ఎస్ఎన్డీపీ నాలాలు కట్టించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి జరగాలని, అందుకు ఎంత ఖర్చయినా పర్వాలేదనేది కేసీఆర్ నినాదం. భూములు చెరబట్టి, ఇండ్లను కూల్చాలనుకోవడం సీఎం రేవంత్‌రెడ్డి విధానం. గాంధీ విగ్రహం పెడితే ఎవరూ అడ్డు చెప్పరు. కానీ విగ్రహం పెట్టడానికి ప్రజల ఇండ్లను కూలుస్తామంటేనే సహించం. మధు పార్క్ నివాసితులకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన హరీశ్‌రావు, బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు. – సబితాఇంద్రారెడ్డి ఎమ్మెల్యే
సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం

కేసీఆర్ హయాంలో సుమారు రూ.4వేల కోట్లతో మూసీ మురుగును శుద్ధి చేసేందుకు 38 ఎస్టీపీలు నిర్మించాం. 2023లోనే ఇంకా 94 ఎస్టీపీల పనులను 80 శాతానికి పైగా పనులు పూర్తి చేశాం. కానీ ఒక్క బస్తీ, ఒక్క ఇంటిని కూడా ముట్టుకోలేదు. ప్రజల ఇండ్లను కూల్చకుండా, వారికి అసౌకర్యం కలిగించకుండా మూసీ శుద్ధీకరణ చేయడం బీఆర్ఎస్ విధానం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూసీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల ఇండ్లు, భూములను చెరబడుతున్నది. ప్రజల ఆస్తులు కొల్లగొట్టి అభివృద్ధి చేస్తామంటే ఊరుకోబోం. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ నోటీసులు ఇచ్చింది. 2020లో భారీ ఎత్తున వర్షం పడ్డప్పుడే మధు పార్క్ అపార్ట్మెంట్లోకి చుక్క నీరు రాలేదు. అలాంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామనడం కాంగ్రెస్ వక్రబుద్ధికి నిదర్శనం. మూసీ బాధితులకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు సహా అందరం అండగా ఉంటాం.
– సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే
రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటాం
రాజకీయాలకు అతీతంగా మధు పార్క్ అపార్ట్మెంట్ నివాసితులకు అండగా నిలబడతాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులతో కలిసి పోరాటం చేస్తాం. భారతదేశ చరిత్రలో చాలా ప్రభుత్వాలు భూ సేకరణ చేసి.. ప్రాజెక్టులు నిర్వహించారు. కానీ అపార్ట్మెంట్లను కూల్చి ప్రాజెక్టులను కడతామంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంఎఫ్ఎల్ లెవల్స్ గుర్తించకుండా, డీపీఆర్‌లు పూర్తి చేయకుండా నోటీసులు ఎలా ఇస్తారు? మూసీకి సంబంధించిన ఎలాంటి నియమ నిబంధనలు ప్రభుత్వం దగ్గర లేదు. ఈ మూసీ ప్రాజెక్టు కేవలం తాను ముఖ్యమంత్రిగా ఒక పని చేసిన అని చెప్పుకోవడానికి రేవంత్‌రెడ్డి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఆదేశాలతో మూసీ బాధిత ప్రజలకు అండగా ఉంటాం. బాధితేలెవరూ భయపడవద్దు. న్యాయం జరిగేవరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
కేసీఆర్ పాలనలో ఒక్క ఇల్ల్లూ కూల్చలే
హైదరాబాద్ మహానగరంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. హైదరాబాద్ ప్రజలను కేసీఆర్ పదేండ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నరు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి ఎక్కడ ఎవరి ఇల్లు కూలుస్తారో.. ఎక్కడ ఎవరి భూమి లాక్కుంటారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మూసీ నది పేరు చెప్పుకుని రెండేండ్ల నుంచి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివస్తున్న ప్రజలు ఆందోళనతో ఇబ్బందులు పడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది మొదలు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో భయ భ్రాంతులకు గురిచేస్తున్నది.
ఇలా చేస్తే హైదరాబాద్ అభివృద్ధి ఎలా సాధ్యం. హైడ్రా కారణంగా ఇప్పటికే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. దీనికి తోడు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మూసీని అభివృద్ధి చేయడానికి ఇండ్లు కూల్చడం ఎందుకు? రిటెయినింగ్ వాల్ కట్టి శుద్ధి చేస్తే మేమూ సహకరిస్తాం. మూసీ బాధితులకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలంతా ముందుకు వచ్చి అండగా ఉంటాం. కేసీఆర్ దిశానిర్దేశంతో కాంగ్రెస్ వైఖరిని ఎండగడతాం. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకునేదాకా కొట్లాడతం.
– మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే, కూకట్పల్లి
మా ఇల్లు కూల్చొద్దు ప్లీజ్
గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించనున్న బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ బాధితులు తమ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అపార్ట్ మెంట్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో బాధితులు, వారి పిల్లలు, వృద్ధులు ప్రదర్శించిన ప్లకార్డులు పలువురిని ఆలోచింపచేశాయి. ‘మా ఇల్లు కూల్చవద్దు’.. ‘మీ అధికార దాహానికి మా ఇళ్లను కూల్చివేయొద్దు’.. ‘మా ఇళ్లను కాపాడి.. మా భవిష్యత్‌ను కాపాడండి’.. వంటి స్లోగన్స్ ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
– సిటీ బ్యూరో, ఫిబ్రవరి 22