ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయం కుప్పకూలింది. 60ఏండ్ల క్రితం నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనంలో రెవెన్యూతోపాటు ఇతర శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నాయి. భవనం మొదటి అంతస్తు సెక్షన్-ఏలో కలెక్టర్ కార్యాలయం ఏవో విధులు నిర్వహిస్తుండగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో ట్రెజరీ కార్యాలయం ఉంది. భారీ వర్షానికి ట్రెజరీ-ఏ కార్యాలయం పైకప్పుతోపాటు సెక్షన్-ఏ గోడ ఒక్కసారిగా కూలింది. సాయంత్రం కలెక్టర్ కార్యాలయంతోపాటు ట్రెజరీలో సిబ్బంది, ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ట్రెజరీ కార్యాలయానికి రక్షణగా ఉన్న ఇద్దరు పోలీసులు ప్రమాదాన్ని గమనించడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ట్రెజరీ కార్యాలయ ఫర్నిచర్, ఫైళ్లు ధ్వంసమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమావేశానికి వచ్చే సమయానికి ముందుగా ఘటన చోటుచేసుకున్నది. అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి కూలిన కలెక్టరేట్ ప్రాంతాన్ని పరిశీలించకుండానే వెళ్లిపోయారు.