హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ పేరు ఎత్తితే కూడా భయమైతున్నదని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. కేసీఆర్‌పై అభిమానం చాటుకునే వారిని కూడా శత్రువుల్లా పరిగణిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు, వేధింపులు ఇందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. ఏదైనా ఉత్సవంలో కేసీఆర్‌పై ఆత్మీయతతో పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తే కూడా కేసులు పెడుతున్నారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల ఓర్వలేనితనం అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. బుధవారం హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న నిర్బంధ వైఖరి, కేసుల నమోదుపై సమాజంలో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టిందని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ పాటలకు డ్యాన్స్ చేస్తే.. డీజే నిర్వాహకులపై కేసులు పెట్టడమేంటని నిలదీస్తున్నారు. 10 కేసులు పెట్టి.. డీజేలు స్వాధీనం చేసుకొని, జైల్లో పెట్టడం నిర్బంధ పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ ఏ చట్టం ప్రకారం సామాన్యులను అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ అంశానికి సబంధించి దళిత యువకుడు రోహిత్‌పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు చేయగా, కొన్నిచోట్ల డీజేలు స్వాధీనం చేసుకుని కాంగ్రెస్ నేతల ఆదేశంతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని చెప్తున్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ సమీపంలో యువతను చెదరగొట్టడం, లారీల్లోని డీజేలు, యాంప్లిఫైర్లు స్వాధీనం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు.
పదేండ్లలో తమకు కేసీఆర్ చేసిన మంచిని గుర్తుచేసుకునే రైతులను కూడా కాంగ్రెస్ నేతలు వదిలిపెట్టడం లేదు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో సామాన్యులు, రైతులు, విద్యార్థులు, మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులను స్వేచ్ఛగా సోషల్ మీడియాలో కూడా షేర్ చేసినా వేధిస్తున్నది. ఆఖరికి వాట్సాప్ చాటింగ్లలోకి కూడా దూరిపోయిన పోలీసులు.. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు పెడితే.. వాటిని డిలీట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. లేకపోతే కేసులు పెడుతున్నారు.
ఇటీవల యూరియా కష్టాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. మీడియాతో మాట్లాడుతున్నా కూడా వారి ఇంటికి పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో చెరువు పరిశీలన సందర్భంగా తన ఇంటికి మార్కింగ్ చేయగా.. బొడిగం గంగన్న అనే వృద్ధుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వాట్సాప్ చాటింగ్‌లో విమర్శించాడు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.
తెలంగాణలో 20 నెలల కాంగ్రెస్ పాలనలో దారుణంగా ప్రజావ్యతిరేకత వచ్చిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాకనే కాంగ్రెస్ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం చేసి, నిరసన తెలపడానికి యత్నించినా, ధర్నాలకు సిద్ధపడినా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పంటలకు యూరియా వేసే కాలం దాటిపోతుండటంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిండి, తిప్పలు మానుకొని పంటలను బతికించుకునేందుకు ఎరువుల కోసం క్యూలో నిలబడుతున్నారు. సొమ్మసిల్లిపోయి.. నీరసించి.. చెప్పులు, ఆధార్‌కార్డులు, పాస్‌బుక్కులు లైన్లలో పెట్టి పక్కన కూర్చుంటున్నారు. అటువంటి దయనీయ పరిస్థితుల్లో రైతులకు సకాలంలో యూరియా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. పోలీసులను పంపి రైతన్నలపై లాఠీలు ఝుళిపిస్తున్నది. ఇదేమని ప్రశ్నిస్తే.. చెంప ఛెళ్లుమనిపిస్తున్నది. ఈ కష్టాలు భరించలేక మీడియాతో మాట్లాడితే.. పోలీసులతో భయపెట్టిస్తున్నదని రైతులు విలపిస్తున్నారు.