మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికార పార్టీలోకి వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి స్థానిక నేతలు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల కేసులో ఏ క్షణంలోనైనా పదవి కోల్పోయే ప్రమాదం ఉండడంతో కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మరోవైపు గద్వాలలో ఉపఎన్నికలు ఖాయమని తెలిసి ఇన్నాళ్లు ఆయన వెంబడి ఉన్న నేతలంతా ఒక్కొక్కరు జారుకుంటున్నారు.
కాంగ్రెస్‌లో చేరినా అ క్కడి బలమైన నాయకులు ఎమ్మెల్యేను పట్టించుకోవడం లేదు. మరోవైపు పార్టీ మారిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి స్పీకర్ నో టీసు ఇవ్వడంతో గద్వాలలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పినట్లు..కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పుకోలేని పరిస్థితి దాపురించింది. ఎమ్మెల్యే పదవి ఊడిపోతే కాంగ్రెస్‌లో టికెట్ వస్తుందో లేదో అని ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఇన్నాళ్లు ఎమ్మెల్యే వెంట ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా జారుకొని బీఆర్ఎస్ వైపు తిరిగి వస్తుండడంతో గద్వాల రాజకీయం రసకందాయంలో పడింది. సీఎం సొంత జిల్లాలోని పార్టీ మారిన ఒక ఎమ్మెల్యేకు ఇంత వ్యతిరేకత వస్తుండడంతో ఆ పార్టీ నేతలే డైలామాలో పడ్డారు.
మరోవైపు ముఖ్య నేతనంతా గులాబీ గూటికి చేరుతుండడంతో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన ముఖ్య బీసీ నేతలు గులాబీ గూటికి చేరకుండా పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేసినట్లు గుప్పుమంటుంది. ఈ నేపథ్యంలో శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ ద్వాలకు వస్తుండడం, గద్వాల గర్జన పేరుతో సభ నిర్వహిస్తుండడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయ్. గద్వాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు స్పీకర్‌కు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించడంతో గద్వాల రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే హఠాత్తుగా ఈ పరిణామాలతో ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేక డైలామాలో పడ్డారు. దీంతో ఆయన వెంట ఉన్న కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్‌లో రెండు వర్గాల పోరుతో ఎమ్మెల్యేకు పదవి గండం రావడంతో కార్యకర్తలు పార్టీని వీడుతుండడంతో అధికార పార్టీకి పెద్ద షాక్ ఇస్తుంది.
గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవతో పాటు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అధికార పార్టీ ఒక్కసారిగా కంగుతుంది. మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సైతం పార్టీని వీడనున్నారు గద్వాల వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
ధరూర్ మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీతోపాటు 2023 ఎన్నికల్లో సరితకు అండగా నిలిచిన ధరూర్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడు కూడా అధికార పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాం గ్రెస్‌లో చేరిన బండ్లకు, సరితకు అధిష్టానం చేయూతనివ్వకపోవడంతో ఇక కాంగ్రెస్‌లో తమకు భవిష్యత్తు లేదని భావించిన కిందిస్థాయి నేతలు కేటీఆర్ సమక్షంలో గులాబీగూటిలో చేరుతున్నారు. ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో అటు ఎమ్మెల్యే ఇటు సరితకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
పార్టీ ఫిరాయింపుల విషయంలో రోజుకో మలుపు తిరుగుతుండడంతో ఇక గద్వాల ఎమ్మెల్యే రాజీనామా చేయడమా లేదా.. స్పీకర్ నిర్ణయంతో పదవి కోల్పోవడం ఖాయం కావడంతో అధికార పార్టీ సొంత పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. మళ్లీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి టికెట్ ఇస్తే తాము పార్టీ మారుతామని సరిత వర్గం గట్టిగా హెచ్చరించింది. తిరిగి పార్టీ టికెట్ తనకే ఇవ్వాలని సీఎం రేవంత్‌ని కోరారు. ఈ నేపథ్యంలో గద్వాలకు చెందిన ఓ బీసీ నేత టికెట్ రాకపోతే పార్టీని వీడుతానని చెప్పడంతో.. భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచా రం జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే ఓడగొడతామని బీసీ నేతలు హెచ్చరించారు. మ రోవైపు ఇటీవలే ఎమ్మెల్యే తాను బీఆర్ఎస్లో ఉన్నానని ఇచ్చిన ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. అయితే గద్వాల జిల్లాలో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా గద్వాల ఎమ్మెల్యే అధికార పార్టీ వైపు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చేరికతో అప్పటికే ఆయన చేతిలో ఓడిపోయిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులు కంగు తిన్నారు.
అధికార పార్టీలోకి ఎమ్మెల్యే చేరడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి ఎమ్మెల్యే వర్గానికి సపోర్ట్ చేయగా ఎంపీ మల్లు రవి సరిత వర్గానికి సపోర్ట్ చేశారు. రాను రాను ఆమె వర్గానికి తగిన ప్రాధాన్యత లేకపోవడంతో ప్రతి కార్యక్రమంలోనూ వర్గాలుగా విడిపోయారు. రోజురోజుకు గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, సరితల మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు నలిగిపోతున్నారు.
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వార్థంతో పార్టీ మారడంతో త్వరలో స్పీకర్ వేటు వేయనున్న నేపథ్యంలో ఉపఎన్నిక కాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గద్వాల రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీకి జలక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున నేతలు రాజీనామాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నేతలంతా చేరుతుండడంతో గులాబీ శ్రేణులు నూతనోత్సాహం నెలకొంది. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీ నేతలతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు.
గద్వాల పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ.. ఆ తర్వాత నడిబొడ్డున సభ ఏర్పాటు చేస్తుండడంతో నడిగడ్డలో భారీ జన సమీకరణకు ప్లాన్ వేశారు. గద్వాల పార్టీ నేతలు బాసు హనుమంతునాయుడు, మాజీ సాట్ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, బీఆర్ఎస్వీ నేత కురువ పల్లయ్య ఇతర ముఖ్య నేతలంతా కలిసి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ముఖ్యంగా గద్వాలలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలంతా రాజీనామా చేస్తుండడం బీఆర్ఎస్లో చేరుతుండడం చర్చనీ అంశంగా మారింది. ద్వితీయ శ్రేణి నాయకులంతా పార్టీని వీడుతుండడంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది.