హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తేతెలంగాణ): ‘గత ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కేవలం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటాను తెరపైకి తెచ్చి డిక్లరేషన్‌లోని ఇతర వాగ్దానాలను విస్మరిస్తున్నారు. ఈ 22 నెలల్లో అసలు బీసీలను ఏం ఉద్ధ్దరించారని కామారెడ్డిలో మళ్లీ సభ పెడుతున్నారు’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నిలదీశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలన్నింటినీ అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేసి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, సివిల్ కాంట్రాక్టుల్లో 42 శాతం కోటా ఇస్తామని, వైన్స్ దుకాణాల్లో 25 శాతం గౌడన్నలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టిన హస్తం పార్టీ ఇప్పుడు ఉత్త చెయ్యి చూపుతున్నదని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ హయాంలో వృత్తులన్నీ విధ్వంసమవుతున్నాయని మండిపడ్డారు. గీత కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గొల్లకుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు చేపపిల్లలు, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తున్నదని విమర్శించారు. చివరికి మంత్రివర్గ కూర్పులోనూ బలహీనవర్గాలకు మొండి చెయ్యి చూపిందని ధ్వజమెత్తారు. వాకిటి శ్రీహరికి అప్రాధాన్య శాఖ ఇచ్చిందని ఆరోపించారు. బీసీ-ఏలో చేరుస్తామని ముదిరాజ్‌లను, మేదర సొసైటీలకు వెదురు బొంగులపై సబ్సిడీ ఇస్తామని చెప్పి నట్టేట ముంచిందని మండిపడ్డారు.
అడుగడుగునా దగా చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కామారెడ్డి సభ పేరిట కొత్త నాటకానికి తెరలేపుతున్నదని నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకే మళ్లీ మాయమాటలు చెప్పేందుకు సిద్ధమవుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల కల్లబొల్లి కబుర్లను బీసీ సమాజం నమ్మబోదని, ఓటుతోనే తగిన బుద్ధిచెప్పేందుకు ఎదురు చూస్తున్నదని స్పష్టంచేశారు. గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని, అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నాడు ఓట్ల కోసం బీసీలకు 63 హామీలిచ్చిన కాంగ్రెస్ అమలులో విఫలమైందని ఎమ్మెల్సీ ఎల్ రమణ ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్లతోపాటు ఏటా రూ.20 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించకుండా 22 నెలల పాలనలో బలహీనవర్గాలను నయవంచనకు గురిచేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేశామని గొప్పలు చెప్పడం కాదని, దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధికోసమే కాంగ్రెస్ కామారెడ్డి సభ పెడుతున్నదని ఆరోపించారు. బలహీనవర్గాలంటే కాంగ్రెస్‌కు మొదటి నుంచి అలుసేనని దుయ్యబట్టారు. వృత్తిదారులను మోసం చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యేనని నిప్పులు చెరిగారు.
హామీలను అమలు చేయడం చేతగావడంలేదని కామారెడ్డి సభలో కాంగ్రెస్ పాలకులు చెంపలు వేసుకొని బీసీలకు క్షమాపణ చెప్పాలని మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ధ్వజమెత్తారు. అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 అలవికాని హామీలిచ్చి ఇప్పుడు నిండా ముంచుతున్నదని నిప్పులు చెరిగారు. కులవృత్తులను నిర్వీర్యం చేయడంతో బీసీ బిడ్డలు బలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లోని హామీలను విస్మరించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే కామారెడ్డిలో సభ పెట్టుకోవడం విడ్డూరమన్నారు. మళ్లీ మాయమాటలు చెబితే నమ్మేవారేవరూ లేరని స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో వీ శ్రీనివాస్‌గౌడ్, ఎల్ రమణ, దాస్యం వినయ్‌భాస్కర్ సమక్షంలో వారంతా గులాబీ గూటికి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పాలనా తీరుతో విసిగిపోయామని స్పష్టంచేశారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. చేరిన వారిలో డీ పెంటయ్య (మాజీ ఎంపీటీసీ), కే గంగాపురి (మాజీ ఉపసర్పంచ్), కే వెంకటయ్య, రంగారెడ్డిపల్లి లక్ష్మయ్య, కురుమగడ్డ వెంకటయ్య, ఎం గోవర్ధన్‌గౌడ్, అక్కపల్లి చెన్నయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ హన్వాడ మండల నేతలు కొండా లక్ష్మయ్య, బాలరాజు, నెత్తికొప్పుల శ్రీను, నాగయ్య, జంబులయ్య, యాదయ్య, మాధవులుగౌడ్, దాసరి రాములు తదితరులు ఉన్నారు.