హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తేతెలంగాణ): ‘సోషల్ మీడియాతో పెట్టుకుంటే పాలకులకు పుట్టగతులుండవు, నేపాల్ ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యం. మూడు రోజుల్లోనే అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది. సీఎం రేవంత్‌రెడ్డి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు పెట్టవద్దని హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు.. రేవంత్ సర్కారుకు చెంపపెట్టని పేర్కొన్నారు.
గురువారం తెలంగాణ భవన్లో పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ జగన్మోహన్, లీగల్ సెల్ మెంబర్ లలితారెడ్డి, సోషల్ మీడియా వారియర్స్ శశిధర్‌గౌడ్ (నల్లబాలు), రంగినేని అభిలాష్‌రావు, అనిల్‌గౌడ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న నీళ్లు, యూరియా కష్టాలను చూపినా, మూసీ, హైడ్రా బాధితుల ఇక్కట్లను వెలుగులోకి తెచ్చినా ప్రభుత్వ ప్రొద్బలంతో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టును రీట్వీట్ చేసిన తమ కార్యకర్త నల్లబాలును అక్రమ కేసులతో వేధించడం దారుణమని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌పై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నదని సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. 22 నెలల్లో 5 వేల అక్రమ పెట్టడమే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రజాపాలన ముసుగులో రేవంత్‌రెడ్డి పోలీసు పాలన నడుపుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసుల మనోభావాలు దెబ్బతినడమేంటని విమర్శించారు.