పెద్దపల్లి : పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ కాంట్రాక్టర్లు (Civil contractors ) సమ్మె ( Strike ) బాట పట్టేందుకు సన్నద్దం అవుతున్నారు. చిన్న, పెద్ద కాంట్రాక్టర్ అనే తేడా లేకుండా పనులు బందు చేస్తామని కాంట్రాక్టర్లు ప్రకటించారు. రెండేళ్ల నుంచి బిల్లులు రాకపోవటంతో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వాపోయారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలను ( Pending Dues ) విడుదల చేయకుంటే వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనులు బంద్ చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
ఈ మేరకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టర్లు కలెక్టర్ కోయ శ్రీహర్షను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెండింగ్ బకాయిలు ఇప్పించేందకు కృషి చేయాలని కలెక్టర్‌ను కోరారు.
అనంతరం పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ది భాగస్వామ్యం కావాలని ఉద్దేశంలో అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు చిత్త శుద్దితో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోయినా ఆస్తులను తనఖా పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని, అప్పులు తెచ్చి పనులు పూర్తి చేశామన్నారు. కానీ ప్రభుత్వం రెండేళ్ల నుంచి పూర్తి చేసిన పనులకు డబ్బులు ఇవ్వటం లేదని వాపోయారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుంటే అత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో చేసిన అభివృద్ది పనులకు ప్రభుత్వం నుంచి రూ. 200 కోట్లకు పైగా బిల్లులు రావాలని వెల్లడించారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు పులి దేవేందర్‌రెడ్డి, జీ రాజిరెడ్డి, కే హన్మంతరావు, మల్క రాజేశం, ఉపేందర్‌రెడ్డి, నారాయణ, ప్రదీప్, బయ్య కొమురయ్య, కనకయ్య, కుమార్, తదితరులు పాల్గొన్నారు.