పెద్దపల్లి, నవంబర్4 : 2024 -25 సీజన్ సంబంధించి పెండింగ్ సీఎంఆర్ డెలివరీ ఈనెల 8 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పెండింగ్ సీఎంఆర్ డెలివరీపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల యాజమాన్యంతో సమీక్ష సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వానాకాలం 2024 సీజన్ సంబంధించి 99.5 శాతం సీఎంఆర్ డెలివరీ పూర్తి చేసి రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
జిల్లాలోని 11 రైస్ మిల్లుల పరిధిలో మరో 29 ఏసీకే రైస్ సరఫరా పెండింగ్ ఉందని, పెండింగ్ రైస్ డెలివరీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత వానకాలం మార్కెటింగ్ సీజన్ ధాన్యం కేటాయింపునకు మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ అందించడం తప్పనిసరని వెల్లడించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.