KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లైసెన్స్డ్ సర్వేయర్లు కలిశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్‌ను కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా 5వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లును రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని.. కానీ నెలల తరబడి పని లేకుండా, ఇటు జీతాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ ముందు లైసెన్స్డ్ సర్వేయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలు ఇస్తుందని.. తెలంగాణలో మాత్రం తమకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు.
ఎమ్మార్వో ఆఫీసుకు పిలిచి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోబెడుతున్నారని.. జీతాలు మాత్రం ఇవ్వడం లేదని లైసెన్స్డ్ సర్వేయర్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.