Thailand : తక్కువ బడ్జెట్లో థాయ్‌లాండ్ వెళ్లొద్దామని ఆశపడ్డ భారతీయులకు ఆ టూర్ ఒక పీడకలగా మిగిలింది. చీప్ ప్యాకేజ్ అంటూ ఆశచూపి రప్పించుకున్న ముగ్గురు భారతీయులను అక్కడి ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్‌నకు పాల్పడింది కూడా భారతీయులే కావడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. థాయ్‌లాండ్‌లో ఉంటున్న పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తితో కలిసి ఐదుగురు భారతీయులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వారు తక్కువ ఖర్చుతో థాయ్‌లాండ్ టూర్ అంటూ విదేశాల నుంచి టూరిస్టుల్ని రప్పించుకుని, వారిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఇలాగే, తక్కువ ఖర్చుతో వారం రోజులపాటు థాయ్‌లాండ్ టూర్ అంటూ ఆన్లైన్లో ప్రకటన ఇచ్చారు. ఇది చూసి ముగ్గురు భారతీయులు వారిని సంప్రదించారు. అలా, మోహిత్ (23), ఆశిష్ (24), హిమాన్షు (20) అనే ముగ్గురు భారతీయ యువకుల్ని తక్కువ ఖర్చుతో థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు రప్పించుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారిని ఒక నిర్మానుష్యంగా ఉండే అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లారు. అంటే.. వారిని కిడ్నాప్ చేశారు. వారి చేతులు, కాళ్లు కట్టేశారు. అరవకుండా నోటిని కూడా టేప్‌తో కట్టేశారు. తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వీడియో కాల్ చేసి, ఆ కాల్లో ఈ యువకులపై దాడికి పాల్పడ్డారు. ముగ్గురి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఒక్కొక్కరూ రూ.40 లక్షలు ఇస్తేనే వారిని వదిలేస్తామని బెదిరించారు. ఈ ఫోన్ కాల్స్ ద్వారా పోలీసులకు దొరకకుండా విదేశాలకు చెందిన నెంబర్స్ ఉపయోగించారు నిందితులు.
ఈ వీడియో కాల్స్ ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అధికారులను సంప్రదించారు. ఈ విషయం బ్యాంకాక్‌లోని కొందరు బంధువుల ద్వారా భారత ఎంబసీకి చేరింది. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ వీడియో కాల్స్ రికార్డింగ్స్, ఇతర ఆధారాలను అనుసరించి భారతీయుల్ని కిడ్నాప్ చేసిన బిల్డింగ్స్‌ను గుర్తించారు. పట్టాయా పోలీసులు ఆ ప్రదేశాన్ని గుర్తించి, రైడ్ చేశారు. అక్కడ ఒక ఫ్లోర్లో ముగ్గురు భారతీయ యువకుల్ని గుర్తించారు. అప్పటికే వారి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉన్నాయి. ఇక నోటిని టేప్‌తో కట్టేశారు. వారి ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురిని పోలీసులు రక్షించారు. ఇదే సమయంలో పోలీసుల రాకతో నిందితులు అక్కడినుంచి పారిపోయారు. అయితే, వీడియో కాల్స్‌లో వారి ముఖాలు, ఇతర వివరాల ఆధారంగా నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లాంగ్ టాన్ ఏరియాలోని ఒక హోటల్లో ఉన్న ఐదుగురు భారతీయుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటికే వారు విమానం ద్వారా పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిందితుల్ని అవతార్ సింగ్ (38), జగ్జిత్ సింగ్ (38), రాంబాలక్ కుమార్ (24), సుఖ్బిర్ సింగ్ (37), కుల్రా సింగ్ (27)గా గుర్తించారు. అంతకుముందు ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన బిల్డింగ్‌పై పోలీసులు దాడి చేయడానికి ముందు నిందితులు ఒక వ్యక్తిని రూ.30 లక్షలు తీసుకుని విడుదల చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అతడి వివరాల్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. భారతీయ ఎంబసీ, స్థానిక పోలీసుల జోక్యంతో భారతీయులు కిడ్నాప్ నుంచి బయటపడ్డారు.