న్యూయార్క్: అణ్వాయుధ పరీక్షలు చేపట్టేందుకు జారీ చేసిన ఆదేశాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సమర్థించుకున్నారు. అమెరికా వద్ద పుష్కలమైన అణ్వాయుధాలు ఉన్నాయని, ఈ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేంతగా ఆయుధాలు ఉన్నట్లు ఆయన అన్నారు. అయితే వాటిని యాక్టివ్ ట్రయల్స్ ద్వారా మెంటేన్ చేయాల్సి ఉందన్నారు. సీబీఎస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకు అణ్వాయుధ పరీక్షలకు ఆదేశాలు జారీ చేశారని అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ రకంగా బదులిచ్చారు.
ఆ అణ్వాయుధాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని, ఇతర దేశాల తరహాలో తాము కూడా న్యూక్లియర్ వెపన్స్ పరీక్షిస్తామని, ప్రస్తుతం తాము మాత్రమే టెస్ట్ చేయడం లేదని, పరీక్షలు చేపట్టని దేశాల జాబితాలో తాము ఉండడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. అమెరికా చివరిసారి 1992లో అణ్వాయుధాన్ని పరీక్షించింది. ఒకవేళ మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటే, వందల మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాల్లో నిజమైన న్యూక్లియర్ పరీక్షలు ఉండవని ఎనర్జీ మంత్రి క్రిస్ రైట్ క్లారిటీ ఇచ్చారు. వాటిని నాన్ క్రిటికల్ పరీక్షలుగా పిలుస్తున్నట్లు చెప్పారు.
రష్యా, చైనా దేశాలు సీక్రెట్‌గా అణు పరీక్షలు చేపడుతున్నట్లు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. కానీ ఆ రెండు దేశాలు తమ చివరి అణు పరీక్షలను 1990 దశకంలోనే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన బురవెస్నిక్ క్రూయిజ్ క్షిపణి, పోసిడాన్ టార్పిడో పరీక్షల్లో అణ్వాయుధం వాడలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్ర పీస్కోవ్ తెలిపారు. ఒకవేళ ఇతర దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తే దాని ఆధారంగా తాము చేపడుతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.