Anil Ravipudi | తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్కు కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందుంటుంది. తన సినిమాల్లో వినోదం, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలను సమపాళ్లలో మిళితం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, థియేటర్లలోనే కాకుండా బుల్లితెరపై కూడా భారీ విజయాలను అందుకుంటున్నారు. తాజాగా విడుదలైన టీఆర్పీ గణాంకాలు చూస్తే అనిల్ రావిపూడి సినిమాలకు టీవీలో కూడా ఎంతటి క్రేజ్ ఉందో స్పష్టమవుతోంది. దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా నుంచే ఆయన తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. అనిల్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా టెలివిజన్‌లో ప్రసారమైనప్పుడు మంచి రేటింగ్స్‌ను నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుతం టీవీ ఛానెల్స్‌కు ప్రేక్షకులు క్రమంగా దూరమవుతున్న ఈ కాలంలో కూడా ఆయన సినిమాలు మాత్రం భారీ టీఆర్పీ రేటింగ్స్ సాధించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ‘పటాస్’. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ టీవీలో ప్రసారమైనప్పుడు 9.3 టీఆర్పీ సాధించి మంచి స్పందనను అందుకుంది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘సుప్రీమ్’ సినిమా బుల్లితెరపై 15.4 టీఆర్పీ సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ సినిమా కూడా టీవీలో ప్రసారమైనప్పుడు భారీ స్పందనను అందుకుంది. ఈ సినిమా 18.4 టీఆర్పీ సాధించి మంచి రికార్డు నమోదు చేసింది. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘F2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన వినోదం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా టీవీలో 18.6 టీఆర్పీ సాధించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మాత్రం టీవీలోనూ భారీ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం 24.2 టీఆర్పీ సాధించి ఆయన కెరీర్లోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ పొందిన సినిమాగా నిలిచింది.ఇక ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండో భాగం ‘F3’ టీవీలో 9.3 టీఆర్పీ నమోదు చేసింది. నందమూరి బాలకృష్ణతో చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భగవంత్ కేసరి’ కూడా బుల్లితెరపై 9.9 టీఆర్పీ సాధించి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్‌తో మరోసారి కలిసి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టీవీలో ప్రసారమైనప్పుడు 18.3 టీఆర్పీ సాధించి మంచి స్పందనను అందుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కూడా 14.2 టీఆర్పీతో మంచి విజయాన్ని నమోదు చేసింది.ఈ గణాంకాలు చూస్తే అనిల్ రావిపూడి సినిమాలు కేవలం థియేటర్లలోనే కాకుండా టీవీ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని స్పష్టమవుతోంది.