AP News | భార్య ఉరివేసుకుంటుంటే ఆమెను ఆపాల్సింది పోయి నవ్వుతూ ఎంజాయ్ చేశాడో భర్త. పైగా “కృష్ణా.. అలా కాదు.. సరిగ్గా ఉరివేసుకో” అని ఆమెను మరింత రెచ్చగొడుతూ వీడియో తీశాడు. కుటుంబ కలహాలతో తనను బెదిరించడానికే ఇలా చేస్తుందని సరదాగా తీసుకుని భర్త ఈ పనిచేశాడు. కానీ అనుకోకుండా ఉచ్చు బిగియడంతో నిజంగానే ఆమె ప్రాణాలు పోయాయి. ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఒంగోలుకు చెందిన శ్రీరాం శ్రీనివాసులు వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలంలో లోకోపైలట్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. దీంతో 2016లో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి(30)ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. రాజంపేట మండలం బోయినపల్లిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. శ్రీనివాసులుకు మద్యం అలవాటు ఉండటంతో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ కలహాలతో జీవితంపై విరక్తి పెంచుకున్న కృష్ణవేణి.. చనిపోతానని కొంతకాలంగా బెదిరిస్తూ వస్తుంది.
ఈ క్రమంలోనే గురువారం మరోసారి గొడవలు జరగడంతో గదిలోకి వెళ్లిన కృష్ణవేణి.. తలుపుకు గడియ పెట్టుకుని చనిపోతానని బెదిరించింది. రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంటుండగా.. శ్రీరాం శ్రీనివాసులు వీడియో కూడా తీయసాగాడు. అయితే ఎప్పటిలాగే కృష్ణవేణి బెదిరిస్తుందని లైట్ తీసుకున్నాడు. ” కృష్ణా సరిగ్గా ఉరేసుకో” అంటూ నవ్వుతూ సలహాలు కూడా ఇచ్చాడు. దీంతో కృష్ణవేణి మంచంపై నుంచి దిగుతుండగా పొరపాటున చీర ఉచ్చు బిగుసుకుంది. తలుపు తీసేందుకు భర్త ఎంత ప్రయత్నించినా గడియరాలేదు.
ఈ క్రమంలోనే శ్రీనివాసులు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు కంగారుగా ఇంట్లోకి వచ్చారు. విషయం తెలుసుకుని.. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లేసరికి ఆమె మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, శ్రీనివాసులు మొదటి భార్య కూడా వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం.