సిరిసిల్ల రూరల్, నవంబర్ 4: మా పెద్దూరు సింగిల్ విండోకు కేటాయించిన కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలంటూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్ విండో పాలకవర్గం, రైతులు మంగళవారం రోడ్డెక్కారు. ఈ మేరకు సిరిసిల్ల – కామారెడ్డి రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. పెద్దూరుకు కలెక్టర్ కొనుగోలు కేంద్రం కేటాయించడంతో కొనుగోలు నిర్వహిస్తున్నామని, ఓ కాంగ్రెస్ నేత అధికారులపై ఒత్తిడి తెచ్చి కొనుగోలు జరగకుండా చూస్తున్నాడని మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామని, 1300 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని వారు పేర్కొన్నారు.
గత కలెక్టర్ సింగిల్ విండోలకు కొనుగోలు కేంద్రాలని గతంలో తొలగించగా సింగల్ విండో పాలకవర్గం కోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని, సింగల్ విండో లకు 30% కేటాయించాలని ఆర్డర్లు రావడంతో పెద్దూరు సింగిల్ విండో కు కలెక్టర్ కొనుగోలు కేంద్రాన్ని కేటాయించారు. గత 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రం కేటాయించి, లారీలు, రైస్ మిల్లు కూడా కేటాయించారు. ఇంతలో ఓ కాంగ్రెస్ నేత అధికారులకు ఫోన్లు చేసి రెండు రోజులు కొనుగోళ్లు ఆపాలని హుకుం జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మళ్లీ సదరు కాంగ్రెస్ నేత పెద్దూరుకు చెందిన మరో కాంగ్రెస్ నేత కలిసి అధికారులపై ఒత్తిడి తెచ్చి పెద్దూరు సింగిల్ విండో కేటాయించిన కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ఆందోళన చేయడంతో హుటాహుటిన సిరిసిల్ల పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను శాంతింప చేసి ఆందోళన విరమించారు. అయినప్పటికీ కొనుగోలు కేంద్రంలో పోలీసులు మోహరించారు. ఘటన స్థలానికి సీఐ కృష్ణ, మెప్మా ఇంచార్జ్ మీర్జా ఫసత్ అలీ బేగ్ చేరుకొని రైతులతో మాట్లాడారు. మాకు కోర్టు ద్వారా కలెక్టర్ కొనుగోలు కేంద్రాన్ని కేటాయించారాని, మా కొనుగోలు కేంద్రం మాకే కావాలంటూ రైతులు స్పష్టం చేశారు. ఓకాంగ్రెస్ నేత తమ పాలకవర్గాన్ని కాంగ్రెస్ చేర్పించుకోవడానికి ప్రయత్నం చేశాడని, తాము చేరకపోవడంతోనే ఇదంతా చేస్తున్నారని వారు ఆరోపించారు.