మునిపల్లి, డిసెంబర్ 06: మునిపల్లి మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్ (బాబాపటేల్) అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ (Chanti Kranthi Kiran) ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిచిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రామానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దక్కుతుందన్నారు. గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నప్పటికీ ఎక్కడా అభివృద్ధి చెందిన దాఖలు లేవని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన దొంగ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఇందిరమ్మ చీరల పేరుతో నాసిరకమైన చీరలను పంపిణీ చేసి ప్రజల్లో మరోసారి నమ్మకం పోగొట్టుకున్నారని తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో తాగిన బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అప్సర్, సీనియర్ నాయకులు కురిసిత్, బక్కన్న, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.