Shankar | భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికత, భారీ విజువల్స్ .. ఈ మూడు పదాలు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు దర్శకుడు శంకర్. ‘జెంటిల్మన్’ నుండి ‘రోబో’ వరకు భారతీయ సినిమాకు కొత్త దారులు చూపించిన ఈ మెగా డైరెక్టర్ ఈ మధ్య కాలంలో అనుకున్న స్థాయి ఫలితాలు అందుకోకపోవడంతో విమర్శల పాలయ్యారు. ‘2.0’కి వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్, ఆ తర్వాత ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ ఫలితాలు శంకర్ ప్రతిష్టను గణనీయంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం నిర్మాతలలో ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో శంకర్ చేసిన కీలక ప్రకటన ఇప్పుడు తమిళ-తెలుగు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రముఖ రచయిత సు.వెంకటేశన్ రాసిన నవల వేల్పారి ఆధారంగా భారీ సినిమా తీయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఏకంగా లక్షకు పైగా కాపీలు అమ్ముడైన చారిత్రక నవల ‘వేల్పారి’. దీనిపై సినిమా అంటే అందరిలో ఆసక్తి మరింత పెరిగింది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘అవతార్’ స్థాయి టెక్నాలజీని ఈ సినిమాలో ఉపయోగిస్తాను అని శంకర్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్.
శంకర్ భారీ బడ్జెట్, షూటింగ్ ఆలస్యం, ఎక్కువ ఖర్చులు నిర్మాతలకు భయానకంగా మారింది. ‘ఇండియన్ 2’ ఆలస్యం వల్ల లైకా ప్రొడక్షన్స్ భారీ నష్టాలు వచ్చాయి. ‘గేమ్ ఛేంజర్’ తో దిల్ రాజుకు భారీ ఒత్తిడి నెలకొంది. ఇలాంటి సమయంలో 1000 కోట్ల చారిత్రక చిత్రం తీసేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తారు? ఈ స్థాయి సినిమాకు స్టార్ హీరో డేట్స్ ఇస్తారా ? అనే ప్రశ్నలు ఫిల్మ్ సర్కిల్స్‌లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ స్టేజ్ లో ఉందనే సమాచారం. ప్రొడ్యూసర్, స్టార్ కాస్ట్, షూటింగ్ ప్లాన్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఇది నిజంగానే పట్టాలెక్కితే శంకర్ కెరీర్‌కు తిరుగులేని రీఎంట్రీ కావొచ్చు ఇది కూడా శంకర్ డ్రీమ్ ప్రాజెక్టుల జాబితాలోనే నిలిచిపోవచ్చు. ‘రోబో’ తర్వాత శంకర్ సినిమాల్లో ప్రేక్షకులు కోరుకున్న మ్యాజిక్, ఎమోషన్, గ్రాండ్ విజన్ కనిపించలేదనేది సినీ విమర్శకుల అభిప్రాయం. ఇప్పుడు ‘వేల్పారి’తో ఆయన మళ్లీ తన పాత ఫామ్ అందుకుంటారా లేదా అన్నది చూడాలి.