హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్ అంటూ ఊదరగొట్టిన రాష్ట్ర సర్కార్ తీరు ‘టెక్నికల్’ సమస్యతో షట్డౌన్ అయింది. మీసేవ కేంద్రాలు, టీఎస్ ఆన్లైన్, ఎమ్మార్వో, రవాణా, పోలీసు.. వంటి ముఖ్యమైన సైట్లు తెరుచుకోకపోవడంతో ప్రజలకు అందాల్సిన సుమారు 580కిపైగా సేవలు నిలిచిపోయాయి. వారం రోజులుగా సమస్య జఠిలమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం చర్యలకు దిగకపోవడంతో లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాలన్నీ పదిరోజులుగా మూతపడే ఉన్నాయి. ప్రభుత్వంలోని ‘స్టేట్ డేటా సెంటర్ ’(ఎస్డీసీ) వద్ద సమస్య ఉన్నదని, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ రాష్ట్ర మీసేవ డైరెక్టరేట్ నుంచి ప్రాంఛైజీలకు సమాచారం అందిందే తప్ప చర్యలేమీ లేవు. ఓవైపు తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో చైర్మన్ మన్నె సతీశ్ వద్దకు ఫ్రాంచైజీలు పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండడం, అవసరమైన పత్రాల కోసం జనం పోటెత్తుతుండడంతో ఏం చేసేదని మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల వెబ్సైట్ల పరిస్థితి తీసికట్టుగా మారింది. ఇటీవల తెలంగాణ పోలీసులకు సంబంధించిన సైట్ సతాయించింది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల సైట్లూ మొరాయించాయి. ఆరోగ్యశ్రీ సైట్ కూడా పనిచేయడం లేదు. కొన్ని ప్రభుత్వ సైట్లలో మాల్వేర్ చొరబడి మొరాయిస్తుండగా, ఎన్ఐసీ చొరవ తీసుకొని కొంత పరిష్కరించే యత్నం చేసింది. పూర్తిస్థాయిలో సైట్లు పని ఎప్పటికి చక్కబడుతాయోనని వినియోగదారులు వాపోతున్నారు.