దుబ్బాక,డిసెంబర్ 5 : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. చలికాలంలో పంచాయతీ పోరుతో పల్లెల్లో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందు నుంచే అభ్యర్థులు ప్రచారంలో లీనమయ్యారు. రిజర్వేషన్ కలిసిరావడంతో కొం దరు అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ఎన్నికల బరిలో దిగారు. మరికొందరు అభ్యర్థులు అనుకూలంగా ఉందోలేదో అంటూ జ్యోతిష్యులను, పూజారులను ఆశ్రయించారు. పోటీలో ఎవరున్నా..ఎందరున్నా తమదే గెలుపు అన్న ధీమాతో మరికొందరు అభ్యర్థులు నామినేషన్లు వేసి, ప్రచారం చేపట్టారు. పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ముందస్తుగానే వార్డు సభ్యుల అభ్యర్థుల ప్యానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ప్యానల్ లేకుండానే ఒంటరి పోరాటంతో ముందుకు పోతున్నారు. ప్యానల్ ఏర్పాటుతో తమకు మరింత ఖర్చు తప్పదని అభ్యర్థులు గుట్టుగా ప్రచారం చేపడుతున్నారు.
విద్య,ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం గ్రామాల నుంచి వెళ్లి ఎక్కడెక్కడో ఉంటున్న వలస ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టిపెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కావడంతో వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ రోజున వారిని రప్పించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటరు జాబితాను ముందేసుకుని ఏ వార్డుకు చెందిన ఓటర్లు ఎక్కడుంటున్నారో తెలుసుకుంటున్నారు.
వారి కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. పట్టణాలకు వెళ్లిన ఓటర్లకు ఫోన్ చేసి ఓటును అభ్యర్థిస్తున్నారు. చాలాఏండ్ల తర్వాత ఫోన్లో ఓటర్లను పలకరిస్తూ ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు. వరుసలు పెట్టుకుని తమ్ముడు, అన్నా, బావ, మామ అంటూ ఫోన్లో సంభాషణలు చేస్తున్నారు. ఓటేసేందుకు తప్పక రావాలంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. వివాహా, ఇతర శుభా కార్యక్రమాలకు పిలువని అభ్యర్థులు, ఇప్పుడు ఎన్నికల పండుగకు గ్రామానికి రావాలంటూ ఘన స్వాగతం పలుకుతున్నారు. తప్పకుండా వచ్చి, ఓటేయాలని వేడుకుంటున్నారు. ప్రేమగా మాట్లాడిన వినని వారికి కాసుల బేరంతో ఆశ చూపుతున్నారు.
పట్నం నుంచి వచ్చేందుకు ప్రయాణ ఖర్చులతో పాటు ఓటుకు నోటు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఓ పక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపడుతూనే, మరోపక్క రాత్రివేళలో దూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను ఫోన్లో ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రతి ఓటు విలువైందిగా వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు భావిస్తున్నారు. ఇప్పుడు అవకాశం చేజారితే మళ్లీ ఐదేండ్ల తర్వాతనే ఎన్నికలు వస్తాయని, అప్పుడు రిజర్వేషన్ అనుకూలంగా రాకపోత పోటీచేసే అవకాశం ఉండదని అనుకుంటున్నారు. దీంతో ఖర్చుకు వెనుకాడకుండా అప్పుసొప్పు చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు సంపాదించుకున్న భూములు, బంగారం విక్రయించేందుకు వెనుకాడడం లేదు. దీంతో గ్రామాల్లో పోటీ రసవత్తరంగా మారింది.
డిగ్రీలు, పీజీలు చదివినా సరైన ఉద్యోగం,ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏడేండ్ల తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధ్దమయ్యారు. వ్యాపారం చేసేందుకు పెట్టుబడి లేక, అప్పులు చేసినా వ్యాపారం ఎలా ఉంటుందో అన్న సందేహంతో ఉన్న యువతకు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఒకింత అవకాశంగా మారాయి. తమకున్న నాలెడ్జ్, పరిజ్ఞానం, వాక్చాతుర్యంతో ప్రజలతో మమేకం అవుతున్నారు. మరికొందరు యువత సోషల్ మీడియా ద్వారా గ్రామంలో ఓట్లను అభ్యర్థించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామ సేవకు అవకాశం ఇవ్వాలని, నిస్వార్థంతో గ్రామాభివృద్ధి చేస్తామంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావడంతో సీనియర్ నేతలకు కొంత ఇబ్బందులు తప్పడం లేదు. తమను సర్పంచ్‌గా గెలిపిస్తే వచ్చే ఐదేండ్లలో చేసే అభివృద్ధి పనుల చిట్టాతో ప్రత్యేక మేనిఫెస్టోలు ప్రకటించి అబ్బురపరుస్తున్నారు.