హైదరాబాద్: తమిళనాడులోని రామనాథపురంలో (Raghunathapuram) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కీళకరై ఈసీఆర్ వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును ఢీ కొట్టిందని వెల్లడించారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతులు విశాఖపట్నంకి చెందినవాళ్లుగా సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.