టేక్మాల్, సెప్టెంబర్ 27: రైతు సంక్షేమం కోసం పనిచేసేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. అలాంటి సహకార సంఘాలు (PACS) నేడు కొందరి రాజకీయాలకు వేదికలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా అన్ని పదవుల్లో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకుంది. పదవుల్లో కొనసాగాలంటే అధికార పార్టీలో చేరాల్సిందే అంటూ రాజకీయాలకు తెర లేపింది. పదవులపై ఆశ ఉన్నవారు అధికార పార్టీలో చేరి తమ పదవులను కాపాడుకున్నారు. ఈ క్రమంలో టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Tekmal PACS) చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన యశ్వంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే పదవిలో కొనసాగాలంటే కాంగ్రెస్‌లో చేరాలయని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. పార్టీ మారడానికి ఆయన ససేమిరా అనడంతో అవిశ్వాస తీర్మానం పెట్టారు. సరైన కోరం లేని కారణంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
అంతటితో ఆగకుండా కొందరు డైరక్టర్లు చైర్మన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించగా మెదక్ ఆర్డీవో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు నిరూపణ కాలేదు. దీంతో అక్కడ కాంగ్రెస్ నాయకులకు చుక్కెదురైంది. ఉన్నత స్థాయి విచారణ మరోమారు జరిపించాలని రాజకీయంగా ఒత్తిడి తేవడంతో దీంతో విచారణ కొనసాగుతుందే తప్ప పూర్తికాలేదు. అయితే ఈ క్రమంలోనే సొసైటీల పదవి కాలం పూర్తి కావడంతో సమయానికి ఎన్నికలను నిర్వహించలేక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాలక వర్గాల పదవీకాలాన్ని పొడిగించింది. ఈ నియమం రాష్ట్రంలోని అన్ని సొసైటీలకు వర్తిస్తుంది. కానీ టేక్మాల్ సొసైటీ చైర్మన్ పదవిపై కన్నేసిన అధికార కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని ప్రదర్శించింది. అధికార బలంతో అడ్డదారిన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చైర్పర్సన్ ఇన్‌చార్జీగా నర్సింహరెడ్డిని నియమిస్తున్నట్లు డీసీవోతో ఉత్తర్వులు జారీ చేయించారు. ఇలా అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన వాటన్నింటిని తట్టుకుని పదవి లేకపోయినా పర్వాలేదు, పార్టీ మారేది లేదని ధైర్యంగా నిలబడ్డారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత రైతుల సంక్షేమమే పరమావదిగా పని చేయాలనుకున్నారు చైర్మన్ యశ్వంత్ రెడ్డి.
అయితే అధికార పార్టీలోని కొందరు కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవి కోసం రైతులను విస్మరించి రాజకీయాలు చేస్తున్నారు. సొసైటీ అభివృద్ధిలో తన బాధ్యతలను నిర్వహించిన సీఈవోపై రాజకీయ వైషమ్యాలను తీసుకువచ్చి సస్పెండ్ చేయించారు. ఇలా సొసైటీ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకోవడమే తమ పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు. ఫలితంగా 2025 మార్చి నాటికి రుణాల రికవరీ లేకపోవడంతో ఈ ఏడాది రైతులకు సకాలంలో పంట రుణాలను ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వేదికగా వాడుకోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
యశ్వంత్ రెడ్డి 2013లో చైర్మన్ కావడానికి ముందు టేక్మాల్ సొసైటీ పరిస్థితి ఎలా ఉండేది, కేవలం తాము అనుకున్నవారికి మాత్రమే రుణాలు ఇచ్చి, కమీషన్లు తీసుకునే పరిస్థితి నుంచి నేడు సాధారణ రైతు నేరుగా సొసైటీలో రుణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే కోట్లాది రూపాయాలు వెచ్చించి వ్యాపార సముదాయం, గోదాములకు మరమ్మత్తులు, సొసైటీ కార్యాలయం ఇలా జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా కలెక్టర్ నుంచి అవార్డు అందుకునే స్థాయికి వచ్చింది. ఆర్థికంగా సొసైటీ బలోపేతం కావడంతో చైర్మన్ పదవిపై కన్నేసిన కాంగ్రెస్ నాయకులు కొందరు కొత్త రాజకీయాలకు తెర తీశారు. ఏదేమైనా హైకోర్టు ఉత్తర్వులతో చైర్మన్‌గా యశ్వంత్ రెడ్డి కొనసాగుతున్నారు.