నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు (Outsourcing Employees) పెండింగ్ జీతాలు చెల్లించకుంటే రాబోయే పండుగలు ఎలా జరుపుకుంటామని తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర మీడియా కన్వీనర్ శ్రీ రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 నుంచి 6 నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా కూడా సమీపిస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు జీతాలను విడుదల చేయకపోవడం వలన సుమారు 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు తక్షణమే విడుదల చేయకపోతే దసరా పండుగ తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా జేఏసీ అధ్యక్షుడు రాజు మరియు విష్ణు, రాజు పాల్గొన్నారు.