పుల్కల్, సెప్టెంబర్ 26: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో అధికారులు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు ఇరిగేషన్ శాఖ డీఈ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టులోకి శుక్రవారం 89,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. జెన్కో ద్వారా 1402 క్యూసెక్కులు, ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా 87,221 క్యూసెక్కులు, మొత్తంగా ఔట్‌ఫ్లో 88,623 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో 17.560 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, ఎగువ నుంచి ఎంత వరద వస్తే, అంత వరద దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతి దృష్ట్యా గొర్రెల కాపరులు, మత్స్య కారులు మంజీరా నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. భారీగా వస్తున్న వరదకు పోచారం గ్రామం,పుల్కల్ గ్రామ శివారులో వందల ఎకరాల పంటలు నీట మునిగాయి. ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్ కుమార్ పోచారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.