సంగారెడ్డి, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో వాన దంచికొట్టింది. గురువారం రాత్రి మొదలైన వర్షం శుక్రవారం ఎడతెరపిలేకుండా కురిసింది. సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు నియోజకవర్గాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోగా, వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సంగారెడ్డి, పటాన్చెరు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు 65వ నెంబరు జాతీయ రహదారిపైకి వరద చేరింది.
దీంతో ముత్తంగి ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి రుద్రారం వరకు జాతీయ రహదారిపై ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల జలమయం అయ్యాయి. పలు చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. సింగూరు ప్రాజెక్టుకు వరద పెరుగుతున్నది. వర్షాలతో ఎగువ నుంచి 81వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి రాగా, ప్రాజెక్టు నుంచి దిగువకు 90వేల క్యూసెక్కులను పదిగేట్ల ద్వారా వదులుతున్నారు. మంజీరా నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, మత్స్యకారులు మంజీరా నదిలోకి వెళ్లవద్దని సింగూరు ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జిల్లాలో అత్యధికంగా పుల్కల్ మండలంలో 10.1 సెంమీటర్షం వర్షం కురిసింది. ఆ తర్వాత కొండాపూర్‌లో 8.1సెం.మీటర్ల వర్షం, సంగారెడ్డిలో 7.1, సదాశివపేటలో 6.4, కందిలో 5.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. పటాన్చెరులో 6.2, అమీన్పూర్లో 6.1, రామంచద్రాపురంలో 5.2, గుమ్మడిదలలో 4.5 సెం.మీటర్ల వర్షం కురిసింది. హత్నూరలో 7.5, మునిపల్లిలో 5.2, చౌటకూరులో 5.1, సెం.మీటర్ష వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలో రోజంతా ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. వర్షాలతో సంగారెడ్డి లోని రాజంపేట, అస్తబల్, గాయత్రినగర్, రిక్షాకాలనీ, మధురానగర్ కాలనీలను వరద ముంచెత్తింది.
అస్తబల్లో ఇండ్లలోకి వరద రావడంతో వంట సామగ్రితోపాటు నిత్యావసర సరుకులు తడిచాయి. సంగారెడ్డిలోని రైతుబజార్ నీట మునిగింది. వర్షపు నీటికి తోడు డ్రైనేజీ వాటర్ రైతుబజార్‌లోకి వచ్చింది. భారీ వర్షాలు కురిసినప్పుడు తరుచూ రైతుబజార్ నీట మునుగుతుండడంతో వ్యాపారులు కూరగాయలు అమ్ముకోలేక పోతున్నారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖాన పాతభవనంలోకి నీళ్లు చేరాయి. పాతభవనంలోకి జనరల్ వార్డుతో పాటు పలువార్డులు వానకు ఉరుస్తున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం నీటిని బయటకు పంపేందుకు దవాఖాన సిబ్బంది శ్రమించారు.
పుల్కల్ మండలంలో భారీ వర్షాలకు పలు గ్రామాల్లో లోతట్టు ప్రాం తాల్లోని ఇండ్ల్లలోకి వర్షం నీరు వచ్చి చేరాయి. పోచారం గ్రామంలో సమీపంలోకి వరద రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పుల్కల్ పట్టణంలో రోడ్లు జలమయమై చెరువును తలపించాయి. 65వ నెంబరు జాతీయ రహదారిపై భారీగా వరద చేరి ట్రాఫిక్‌జామ్ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 1200 ఎకరాల్లో పంటలు నీట మునిగా యి.
సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, అందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, సోయాబీన్, పెసర, మినుము తదితర పంటలు నీట మునిగాయి. జిల్లాలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు 5వేల ఎకరాలకు పైగా పంటనష్టం వాటిల్లింది. తాజాగా కురిసిన వర్షాలతో మరోవెయ్యి ఎకరాలకు పైగా పంటనష్టం జరిగింది. శనివారం భారీగా వర్షాలకు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో పంటనష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పటాన్చెరు, సెప్టెంబర్ 26: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం పలుమార్లు భారీగా కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పటాన్చెరులో 62.0 మిల్లీమీటర్లు, రామచంద్రపురంలో 50.0 ఎం.ఎం, అమీన్పూర్లో 60.0 ఎం.ఎం, జిన్నారంలో 59.7ఎం.ఎం, గుమ్మడిదలలో 48.0 ఎం.ఎం వర్షపాతం నమోదైంది. పటాన్చెరులో నక్క వాగు ఉధృతంగా ప్రవహించడంలో ముత్తంగి నుంచి పోచారం, ఇంద్రేశం వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి ఇంద్రేశం వైపు వెళ్లే సర్వీస్ రోడ్డును పోలీసులు మూసివేసి 65వ జాతీయ రహదారిపై పటాన్చెరు వైపు వాహనాలు మళ్లించారు. పటాన్చెరు మార్గంలో పోచారం వెళ్లే రోడ్డు నుంచి ఇంద్రేశం వైపు వాహనల రాకపోకలు సాగిస్తున్నారు. రామచంద్రాపురం మండలం వైపు నుంచి నక్క వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. 65వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి ముత్తంగి, ఇస్నాపూర్, లక్డారం, రుద్రారం వద్ద భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇస్నాపూర్, లక్డారం, రుద్రారం గణేశ్ మందిర్ వద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేయడంతో పాటు సర్వీస్ రోడ్ల నిర్మాణం చేశారు. సర్వీస్ రోడ్లపై వాహనాలు నిలిచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. ముత్తంగిలోని రైస్‌మిల్లు రోడ్డును వరద ముంచెత్తింది. చిట్కుల్లోని నాగార్జున కాలనీలోకి వరద భారీగా రావడంతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకృతి సిద్ధ్దంగా ఉన్న కాల్వలను కొందరు కబ్జా చేయడంతో భారీ వర్షాలు పడిన ప్రతిసారి వరద రోడ్లపైకి వస్తున్నది. లోతట్టు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.