Musi River | హైదరాబాద్ : గతంలో మునుపెన్నడూ లేని విధంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ నది ఉధృతికి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నది సమీపంలోని ప్రాంతాలకు కూడా వరద పోటెత్తింది. దీంతో లంగర్ హౌస్‌లోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. స్థానికంగా ఉన్న బాపూ ఘాట్ కూడా నీట మునిగింది. సమీపంలో ఉన్న ఫ్లై ఓవర్ కింద వరద నీటితో నిండిపోవడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. భారీ వరద నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు.
ఇక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద పోటెత్తడంతో.. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్‌కు 12,600 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండడంతో 15 గేట్లను తొమ్మిది అడుగుల మేర ఎత్తి 13,335 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్‌లోకి 18,500 వరద నీరు వస్తుండగా, 11 గేట్లను ఎనిమిది అడుగుల మేర ఎత్తి దిగువకు 20,872 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ రెండు జలాశయాల నుంచి సుమారు 35 వేల క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి చేరుతుంది. ఈ క్రమంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్, చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.