కౌగిలింత భలే వింతైనది. ఇష్టమైన వారికి అందిస్తే.. అంతులేని ప్రేమను ప్రసాదిస్తుంది. ఒక్క క్షణంలోనే వారిలోని బాధలన్నిటినీ రూపుమాపుతుంది. మానసికంగానే కాదు.. శారీరకంగానూ అనేక ప్రయోజనాలు అందిస్తుంది కౌగిలి. అందుకే.. ఈ ప్రేమికుల దినోత్సవం రోజు మీ భాగస్వామికి ఓ వెచ్చని కౌగిలిని కానుకగా ఇవ్వండి.
ఇష్టమైనవారిని కౌగిలించుకున్నప్పుడు.. శరీరంలో ‘ఆక్సిటోసిన్’ విడుదల అవుతుంది. ‘లవ్ హార్మోన్’ అని పిలిచే ఈ హార్మోన్.. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. అదే సమయంలో ‘కార్టిసోల్’ స్థాయులు కూడా తగ్గుతాయి. మానసిక, శారీరక ఒత్తిళ్లు దూరమవుతాయి. భాగస్వామిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే.. ఇద్దరిలోనూ సానుకూల భావాలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ‘హగ్’ ముందుంటుంది. అంతేకాకుండా.. కౌగిలితో శరీరంలో ‘హెల్పర్ టి’ సెల్స్, యాంటి బాడీలూ మెరుగుపడతాయట.
ఇవి శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి కూడా. వెచ్చని కౌగిలింతతో.. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగుతుంది. దాంతో, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ప్రియమైన వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే.. వారిలో ఆక్సిటోసిన్, సెరోటోనిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒంటరితనం, కోపం దూరమవుతుంది.