హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో (Vikarabad) వరుసగా రెండో రోజూ భారీ వర్షం కురుస్తున్నది. వాగులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి కొండల నుంచి వరద ప్రవాహం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో అనంతగిరి, కోటిపల్లి ప్రాజెక్టులకు పర్యాటకులు రావొద్దని అధికారులు సూచించారు. వికారాబాద్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇక తాండూరులో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. తాండూరు మండలం వీర్శెట్టిపల్లిని వరద నీరు చుట్టుముట్టింది. గ్రామ ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయారు. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలతో కాగ్నా నది పాత వంతెనపై నుంచి వరద ప్రవహిస్తున్నది. బషీరాబాద్ మండలం జీవన్గీ, నావాండ్గి వద్ద ఉధృతంగా నది ప్రవహిస్తున్నది. దీంతో కాగ్నా నది ఒడ్డున్న ఉన్న మహాదేవ లింగేశ్వర ఆలయం నీటమునిగింది. ఐదేండ్ల తర్వాత కాగ్నా నదికి భారీ వరద వచ్చిందని స్థానికులు తెలిపారు. మరోవైపు మూసీని వరద ముంచెత్తడంతో హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ నీటమునిగింది.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం జిల్లాలో 44.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. పరిగి మండలంలో 80.3 మి.మీటర్ల నమోదుకాగా, వికారాబాద్‌లో 77.1, కులకచర్లలో 76.9, నవాబుపేటలో 74.8, పరిగిలో 61.1, దోమలో 48.6, పూడూరులో 59.8, మర్పల్లిలో 49.3, ధారూరులో 62.1 , బంట్వారంలో 32.5, బషీరాబాద్‌లో 23.3, యాలాలలో 38.3 , తాండూరులో 31.2, దుద్యాలలో 28, పెద్దేముల్లో 13.2, కొడంగల్‌లో 27.2, చౌడాపూర్‌లో 25.3, దౌల్తాబాద్ మండలంలో 13.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.