Peddi Sudarshan Reddy | వరంగల్ : వడ్డించిన విస్తరిని లాక్కోవడం కాంగ్రెస్ పార్టీ నైజమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ విస్మరించిందన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నర్సంపేట డివిజన్లో పని చేస్తున్న జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణం కోసం రూ. 7.50 కోట్లతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా, దానిని అగ్రిమెంట్ దశలో నిలిపివేసింది ఎవరో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల నోటికాడి బుక్కను లాక్కోవడం హేయమైన చర్య అన్నారు. బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక ప్రజల రుణం తీర్చుకునేందుకు గోదావరి జలాలను తరలించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశానన్నారు.
అంతేగాక విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తారు, సీసీ రోడ్ల కోసం ప్రత్యేక జీవోల ద్వారా రూ. 250 కోట్ల నిధుల విడుదలకు కృషి చేస్తే, ఆ పనులు చేపట్టాల్సిన పాలకులు బీఆర్ఎస్కు ఎక్కడ పేరొస్తుందోననే అక్కసుతో అర్ధాంతరంగా రద్దు చేయడం వారి నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. అంతేగాక అధికారంలోకి వచ్చి 11 నెలలైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పథకాలనే ప్రజలకు పంపిణీ చేస్తున్నదన్నారు.
అలాగే తాము చేపట్టిన ఉద్యోగాలు, నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నారే తప్ప, ఇప్పటికీ రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలో అభివృద్ధి కోసం తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేయకుండా ప్రజాభివృద్ధి వైపు దృష్టి సారించాలని హితవు పలికారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, రాబోయే రోజుల్లో నాయకులను ఊళ్లోకి కూడా రానివ్వని పరిస్థితులు దాపురించకుండా సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధికి బాటలు వేయాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | కొలిమిలా కొడంగల్..! సీఎం రేవంత్ తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
KTR | ఆడబిడ్డ పెళ్లికి రూ. 3 లక్షల ఆర్థికసాయం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
DRDO | లాంగ్రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో