(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మోదీ పాలనలో దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు మూడోసారి రోడ్డునపడ్డారు. 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకులు, ఏటీఎంల ముందు తొలిసారి, కరోనా సంక్షోభ సమయంలో అక్సిజన్ సిలిండర్ల కోసం రెండోసారి వీధుల్లోకి వచ్చిన సామాన్యులు.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కోసం ముచ్చటగా మూడోసారి.. తెల్లారకముందే గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలో పడిగాపులు కాస్తున్నారు. సొంత డబ్బును తీసుకొనేందుకు అప్పుడు ఏటీఎంల ముందు అలసిసొలసి మృత్యువాత పడ్డట్టే, కరోనా సమయంలో ప్రాణవాయువు కోసం హాస్పిటల్స్ ముందు ప్రాణాలను వదిలినట్టే.. ఇప్పుడు కూడా గ్యాస్ బుడ్డీ కోసం పేదోడు ప్రాణాలను పణంగా పెడుతుండటం కలవరానికి గురి చేస్తున్నది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై పక్షం రోజులయ్యింది. యుద్ధం కొనసాగితే ఇంధన సంక్షోభం ముంచుకొస్తుందని తెలుసు. అయినప్పటికీ, ఉదాసీనంగా వ్యవహరించిన కేంద్రం.. ఇప్పుడు పేదల కష్టానికి కారణమయ్యిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏటీఎంల ముందే..
నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యమని పేర్కొంటూ 2016 నవంబర్ 8న అప్పటికే చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 వంటి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ అకస్మాత్తుగా ప్రకటించారు. పాత నోట్లను బ్యాంకులు, ఏటీఎంలలో మార్చుకొని, కొత్త నోట్లను తీసుకోవాలని చెప్పారు. పరిమిత సమయం దాటితే, పాత నోట్లు చెల్లబోవని పేర్కొన్నారు. దీంతో ఆందోళన చెందిన కోట్లాది మంది ప్రజలు రోజులతరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరారు. క్యూలోనే కుప్పకూలి వంద మందికి పైగా మృత్యువాతపడ్డారు.
కరోనాలోనూ కకావికలమే
2021 ఏప్రిల్-మే సమయంలో విజృంభించిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా లక్షలాది మంది దవాఖానల్లో చేరారు. దీంతో ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబైలోని పలు హాస్పిటల్స్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది. తమ ఆత్మీయులకు ప్రాణవాయువును అందించాలని ఏజెన్సీలు, దవాఖానల ముందు వేలాదిమంది బారులు తీరారు. క్యూలోనే కొందరు మరణించగా, ఆక్సిజన్ అందక దవాఖానల్లో మరికొందరు తనువుచాలించారు.