మహబూబ్‌నగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్లటౌన్: రైతులకు రైతుబంధు రావడం లేదని, వెంటనే ఇప్పించాలని కోరిన సర్పంచ్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా భూముల రీసర్వేపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి జూపల్లి ముఖ్యతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ మేకల వరలక్ష్మి మాట్లాడుతూ రైతుబంధు మాట ఎత్తగానే మంత్రి ఆమె చేతిలో నుంచి మైక్ గుంజుకోవడంతో అక్కడనున్న వారంతా కంగుతిన్నారు. ఆవేశంతో ఊగిపోయిన ఆయన పొంతనలేని మాటలతో గ్రామంలోని కేసులు, గొడవల గురించి మాట్లాడటంతో అవాక్కయ్యారు. మంత్రిననే విషయాన్ని మరిచిపోయి అభివృద్ధి మాటెత్తకుండా ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో ఇప్ప సారాను ప్రారంభించే విషయంలో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మీడియాతో మాట్లాడారు. ఇప్పసారాపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు, అభిప్రాయాలపై అధ్యయనం చేసి, అసెంబ్లీలో సమగ్రంగా చర్చి స్తామని వెల్లడించారు.