న్యూఢిల్లీ: భారతీయ ఐటీ రంగంలో నియామకాల విధానంలో పెద్ద మార్పు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఫ్రెషర్ల స్థాయిలో పెద్ద కంపెనీలు నైపుణ్యాల ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. అంతేకాకుండా ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం చేసే ధోరణి పెరుగుతుండటంతో చాలామంది అభ్యర్థులు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలపై గందరగోళంలో పడ్డారు. ఐబీఎమ్, యాక్సెంచర్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు అభ్యర్థులకు ప్రాజెక్ట్‌ల లభ్యత, వ్యాపార అవసరాలు లేదా పరిపాలనా ప్రక్రియలపై ఆధారపడి మాత్రమే జాయినింగ్ తేదీలు ఉంటాయని స్పష్టం చేశాయి. దీనివల్ల చాలామంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పని ప్రారంభించడానికి నెలల తరబడి, కొన్నిసార్లు ఏడాది కంటే ఎక్కువ కాలం వేచి చూడాల్సి వస్తున్నది.
గతంలో బెంచ్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి వేలాది మంది ఫ్రెషర్లను నియమించుకునేవారని, కానీ ఇప్పుడు నియామకాల విధానం పూర్తిగా ప్రాజెక్ట్, డిమాండ్ ఆధారితంగా మారిందని నిపుణులు చెప్తున్నారు. ఈ ధోరణి ఐటీ రంగంలో వస్తున్న సమూల మార్పును ప్రతిబింబిస్తున్నది. దేశంలోని ఐదు అతిపెద్ద ఐటీ కంపెనీలు 2025 ఆర్థిక సంవత్సరంలో 12,718 మందిని చేర్చుకోగా 2026లో 6,981 ఉద్యోగాలను తగ్గించాయి. అయితే కొన్ని ఆశాజనక మార్పులు కూడా కనిపిస్తున్నాయి. దేశంలోని ఆరు అతిపెద్ద ఐటీ కంపెనీలు 2027 మొదటి త్రైమాసికంలో నికరంగా 5,400 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. అయినప్పటికీ ఫ్రెషర్లకు భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉన్నది.
హెచ్ఆర్ నిపుణుల ప్రకారం నియామకాలు ప్రధానంగా ఏఐ, డాటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇతర ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో పెద్దఎత్తున అభ్యర్థులను తీసుకునే విధానం తగ్గి, ఏఐకి సిద్ధంగా ఉన్న ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే విధానం పెరుగుతున్నదని నిపుణులు అంటున్నారు. టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతిశర్మ ప్రకారం.. పెద్ద ఐటీ సేవల కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలను పూర్తిగా నిలిపివేయడం లేదు. కానీ ఎంపిక విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్పత్తి సాధించడానికి నెలల తరబడి శిక్షణ అవసరమయ్యే గ్రాడ్యుయేట్లను యజమానులు ఇప్పుడు కోరుకోవడం లేదు.
మొదటి రోజు నుంచే ఏఐ టూల్స్‌తో పనిచేయగలిగే వ్యక్తులను వారు కోరుకుంటున్నారు. కంపెనీలు ఏఐ, క్లౌడ్, డాటా, ఆటోమేషన్ నైపుణ్యాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నందున గతంలో మొత్తం నియామకాల్లో 28 శాతంగా ఉన్న ఫ్రెషర్ల వాటా ఇప్పుడు దాదాపు 15 శాతానికి తగ్గింది. ఆన్ హ్యూమన్ క్యాపిటల్ ట్రెండ్స్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 43 శాతం సంస్థలు ఇప్పటికే ఏఐని ఉపయోగించాయి. మరో 20 శాతం ప్రోగ్రామ్‌లను పైలట్ చేస్తున్నాయి. ఆసియా పసిఫిక్‌లోని 87 శాతం సంస్థలు ఏఐ కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, కొత్త నైపుణ్యాలు అవసరమని నమ్ముతున్నాయని ఆన్ పరిశోధనతో తెలుస్తున్నది. ఇది గ్రాడ్యుయేట్లు ఏఐ ఆధారిత పని విధానాలకు అలవాటు పడాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నది.
సంప్రదాయ ఐటీ రంగం రూపాంతరం చెందుతున్నప్పటికీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు(జీసీసీ) అటువంటి ప్రతిభకు ప్రధాన నియామక కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. జీసీసీలు బహుళ జాతీయ కంపెనీల ఆఫ్‌షోర్ సెంటర్లు. ఇవి వారి ప్రపంచ కార్యకలాపాల కోసం టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, అనలిటిక్స్, ఇతర వ్యాపార విధులను నిర్వహిస్తాయి. జీసీసీలు ప్రతిభను ఆకర్షిస్తున్నప్పటికీ, ఫ్రెషర్ల క్యాంపస్ నియామకాల విషయానికి వస్తే ఆ సంఖ్య సరిపోలడం లేదు. ఎక్స్ఫెనోకు చెందిన అనిల్ ఇథనూర్ మాట్లాడుతూ.. క్యాంపస్ నియామకాల సమయంలో భారతీయ ఐటీ కంపెనీలు నియమించుకునే స్థాయిలో జీసీసీలు నియామకాలు చేపట్టలేవు అని తెలిపారు. వారు నిర్దిష్ట పాత్రలు, ప్రత్యేక నైపుణ్యాల కోసం నియమించుకుంటారు.
గ్రాడ్యుయేట్లు ఏఐ, డాటా అనలిటిక్స్, ఆటోమేషన్ టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజినీరింగ్‌లో బలమైన పునాదిని అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అభ్యర్థులు ఏ డిగ్రీని కలిగి ఉన్నారనే దానికంటే వారు ఏం చేయగలరనే దానిపైనే యజమానులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నీతిశర్మ అన్నారు. ప్రాథమిక ఏఐ అవగాహన ఇకపై సరిపోదని, గ్రాడ్యుయేట్లకు ఎల్ఎల్ఎం ఏపీఐలు, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఆర్ఏజీ పైప్‌లైన్ వంటి పరికరాలతోపాటు బలమైన డాటా, క్లౌడ్ ప్రాథమికాంశాలతో ఆచరణాత్మక అనుభవం అవసరమని తెలిపారు. ముఖ్యంగా అప్రెంటిస్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లు, నిజమైన సమస్య పరిష్కారాన్ని ప్రదర్శించే పోర్ట్‌ఫోలియోలు సర్టిఫికెట్ల కంటే చాలా విలువైనవిగా మారుతున్నాయని అన్నారు.