Nani | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన తాజా సినిమా ‘పారడైజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా తమిళనాడులో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశం మరియు ఆయన సాధించిన విజయాలపై నాని స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
కేవలం విజయ్ పెద్ద స్టార్ కావడం వలనో, ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లు సాధించడం వలనో ప్రజలు ఆయనకు ఓటు వేయలేదని నాని అభిప్రాయపడ్డారు. విజయ్ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయారని, తమిళనాడులోని ప్రతీ ఇంటా ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా మారాడని, ఆ గాఢమైన అనుబంధం వల్లే ప్రజలు ఆయనను నమ్మి గెలిపించారని నాని కొనియాడారు. తాను అసెంబ్లీకి సంబంధించిన విజయ్ క్లిప్పింగ్స్‌ను చూశానని, ఆ దృశ్యాలు చాలా అద్భుతంగా అనిపించాయని నాని పేర్కొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల పాటు విజయ్ అద్భుతమైన పాలన అందించాలని, తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.