Kalyanam Kamaniyam Jeevitham | టాలీవుడ్లో సరికొత్త ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాజవంశీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. తాము ఇటీవల ఈ సినిమాను కొంతమంది శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ప్రదర్శించామని, సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారని తెలిపారు. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల కావడం, ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈవెంట్‌కు వచ్చి ఆశీర్వదించడం తమ చిత్రానికి లభించిన గొప్ప అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ మరియు యూత్ ఆడియన్స్‌ను అలరించే చక్కటి ఎంటర్టైనర్ అని, సినిమా చిన్నదైనా కంటెంట్ మాత్రం చాలా బలంగా ఉంటుందని పేర్కొన్నారు.
దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. టైటిల్ వినగానే నిర్మాతలు ఎంతో ఇష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ చిత్రంలో మంచి భావోద్వేగాలు, ఆకట్టుకునే పాటలతో పాటు ఊహించని అనేక ట్విస్టులు ఉంటాయని, థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పెట్టిన ప్రతీ రూపాయికి పూర్తి స్థాయి వినోదాన్ని పొందుతారని ధీమా వ్యక్తం చేశారు. నూతన నటీనటులైనప్పటికీ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని, లెజెండరీ నటుడు సత్యానంద్ గారి పర్యవేక్షణలో నటన మరింత రంజుగా వచ్చిందని పేర్కొన్నారు.
హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ.. తమ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా భారీ స్పందన లభించిందని తెలిపారు. నాని నటిస్తున్న ‘పారడైజ్’ సినిమాతో పాటు తమ సినిమా విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, తాను నాని గారికి పెద్ద అభిమానినని, ఆయన సినిమాలే తనకు స్పూర్తి అని చెప్పారు. ఎంతో ప్రేమతో తెరకెక్కించిన ఈ చక్కటి కుటుంభ కథా చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆశీర్వదించాలని కోరారు. హీరోయిన్ సాహితి ఆవంచ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకులు ఈ సినిమాను చూసి తమను మరింత ఆదరించాలని కోరారు. ఈ చిత్రంలో ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎన్.సి. అరవింద్ ఏకలవ్య మాటలు అందించగా, శ్రీ మురళీ కార్తికేయ సంగీతం సమకూర్చారు. వెంకటరాజు డి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.