ప్రముఖ నటి రష్మిక మందన్న గాయపడ్డారు. ‘మైసా’ సినిమా పాట చిత్రీకరణలో భాగంగా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తుండగా ఒక్కసారిగా జారిపడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. హుటాహుటిన ఆమెను సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం రష్మిక తుంటి భాగంలోని కణజాలానికి బలమైన గాయమైనట్టు వైద్యులు గుర్తించారు. రష్మికకు తగిలిన ఈ గాయం విషయంలో వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.
తీవ్రమైన శారీరక శిక్షణ పొందే క్రీడాకారుల్లో మాత్రమే ఈ తరహా గాయాలు కనిపిస్తాయని వారు వెల్లడించారు. ఆరు వారాలు ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించారు. అనుకోని ఈ ప్రమాదం కారణంగా రష్మిక ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన షెడ్యూల్స్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమెకు చెందిన సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ ఉన్న షెడ్యూల్స్‌ని తాత్కాలికంగా మేకర్స్ వాయిదా వేశారు.
కొన్ని రోజుల క్రితం కాకినాడ పోర్ట్‌లో అగ్ర నటుడు బాలకృష్ణ గాయపడ్డ విషయం తెలిసిందే. ‘డ్రాగన్’ షూటింగ్లో ఎన్టీఆర్ కూడా గాయాలపాలయ్యారు. ‘పెద్ది’ షూటింగ్ సమయంలో ఏర్పడ్డ గాయానికి కోయంబత్తూరు వెళ్లి రామ్‌చరణ్ సర్జరీ చేయించుకున్నారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పుడు రష్మిక కూడా గాయపడటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.