న్యూయార్క్, జూలై 31: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం జెట్ స్పీడ్తో దూసుకుపోయింది. ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన నాల్గో త్రైమాసికానికిగాను బుధవారం కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి నమోదయ్యాయి. రెవెన్యూ గతంతో పోల్చితే 18 శాతం ఎగిసి 90 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది మదుపర్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆ కంపెనీ షేర్లను అంతా ఎగబడి కొన్నారు. దీంతో ఒక్కరోజే మైక్రోసాఫ్ట్ షేర్ వాల్యూ 15.5 శాతం పుంజుకున్నది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) ఎగబాకింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇదో రికార్డు. కేవలం సింగిల్ ట్రేడింగ్ సెషన్లో ఈ స్థాయిలో ఏ కంపెనీ మార్కెట్ విలువ మునుపెన్నడూ పెరిగింది లేదుమరి. అంతేగాక ఈ పెరుగుదల దక్షిణాఫ్రికా, వియత్నాం, టర్కీ వంటి దేశాల మొత్తం స్టాక్ మార్కెట్ విలువ కంటే పెద్దది కావడం విశేషం. అలాగే ఈ బంపర్ ర్యాలీతో ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విదియాను మరోసారి అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది.
ఇదీ సంగతి..
కృత్రిమ మేధస్సు (ఏఐ)పై మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున పెడుతున్న పెట్టుబడులు సత్ఫలితాలనే ఇస్తున్నాయని కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తేల్చాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అజూర్.. ఈ సూపర్ షోకి కారణమైంది. ఊహించిన దానికంటే ఆకర్షణీయ వృద్ధిని కనబర్చింది. దీంతో మార్కెట్కు ఏఐ మౌలిక సదుపాయాలు, సేవలపై మైక్రోసాఫ్ట్తోపాటు ఇతర సంస్థలు చేస్తున్న ఖర్చుల్లో అర్థం ఉందన్న సంకేతాలనూ ఇచ్చింది. నిజానికి ఇన్నాళ్లూ ఏఐ కోసం అధికంగా కార్పొరేట్లు వెచ్చిస్తున్నారన్న ఆందోళనలు మదుపర్లలో ఉండేవి. మైక్రోసాఫ్ట్ వాటికీ సమాధానమిచ్చినైట్టెంది. ఈ నేపథ్యంలోనే ఎన్విదియా, అమెజాన్, అల్ఫాబెట్ తదితర మరిన్ని టెక్ సంస్థలు రాబోయే రోజుల్లో ప్రకటించే ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అభిప్రాయాలు అంతటా ఏర్పడుతుండటం గమనార్హం.