(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): విదేశీ విద్యార్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇవ్వబోతున్నారా? ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ పూర్తి చేసి తద్వారా మెరుగైన ఉద్యోగం, హెచ్-1బీ వీసా సాధించాలనుకొనే విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నారా? తాజా వార్తలను బట్టి చూస్తే ఇది నిజమేననిపిస్తున్నది. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకొని.. ఓపీటీ చేయాలనుకొనే విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు (రూ. 95 లక్షలు) విధించాలనే ప్రతిపాదనలను ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు అమెరికన్ పత్రిక ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఓ కథనంలో పేర్కొంది. ఇదే జరిగితే, అమెరికాలో చదువు పూర్తిచేసి అక్కడే ఉండి మెరుగైన ఉద్యోగం చేయాలనుకొనే వారికి పెద్ద ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ, ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఓపీటీ ప్రోగ్రామ్‌పై విద్యార్థులు ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్తున్నారు.
అసలేమిటీ ఓపీటీ?
డిగ్రీ పూర్తైన విదేశీ విద్యార్థులు ఎలాంటి వర్క్ వీసా అవసరం లేకుండా అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెసులుబాటు కల్పించేదే ఓపీటీ. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఎఫ్-1వీసాతో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత 1-3 ఏండ్లపాటు తమ రంగంలో అనుభవం పొందేందుకు ఈ ఓపీటీ ప్రోగ్రామ్ సాయపడుతుంది. ఓపీటీకి ఎంపికైతే తొలి ఏడాది అక్కడి సంస్థల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. స్టెమ్ కోర్సులు (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) పూర్తి చేసిన వారికి అదనంగా మరో రెండేండ్లు పనిచేసే వెసులుబాటు లభిస్తుంది. ఇదేసమయంలో పలువురు తమ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకొని హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకొంటారు. అయితే, ఇప్పుడు ఓపీటీ చేయాలనుకొనే విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు విధించాలనే ప్రతిపాదనలను ట్రంప్ సర్కార్ తెరమీదికి తీసుకురావడంతో విదేశీ విద్యార్థులు పునరాలోచనలో పడినట్లయ్యింది.
భారతీయ విద్యార్థులపై ప్రభావం ఇలా..
అమెరికాలో ప్రస్తుతం అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థుల సమూహంగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఓపెన్ డోర్స్ తాజా నివేదిక ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 3.63 లక్షల మంది భారతీయులు చేరారు. ఇందులో దాదాపు 40 శాతం మంది ఓపీటీ ప్రోగ్రామ్ ఎంచుకొంటున్నారు. బ్యాంకు రుణాలతోనే చాలామంది అమెరికా బాటపడుతున్నారు. తాజా ప్రతిపాదనలతో వీరిపై తీవ్ర ప్రభావం పడొచ్చని నిపుణులు చెప్తున్నారు. కాగా హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్ కోర్టు అడ్డుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ సర్కార్ ఓపీటీపై కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏడాదిన్నరగా ఇబ్బందులు..
రెండోసారి పగ్గాలు చేపట్టిన ఈ ఏడాదిన్నర కాలంలో అక్రమ వలసలు, హెచ్1బీ, గ్రీన్‌కార్డు, జన్మతః పౌరసత్వ రద్దు.. ఇలా ప్రతీ అంశంలో ట్రంప్ సర్కార్ నిర్ణయం భారతీయులకు కునుకు లేకుండా చేస్తున్నది. రెండోసారి ట్రంప్ పగ్గాలు చేపట్టగానే అమెరికా వలస విధానాలను మరింత కఠినతరం చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన లక్షలాది మందిని ఆయన సొంత దేశాలకు సాగనంపారు. కాళ్లకు గొలుసులతో భారతీయులను బంధించి ఇక్కడికి పంపించడం వివాదాస్పదమైంది. ఇక, ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కారు వింత రూల్స్‌ను తీసుకొచ్చింది. విద్యార్థి లేదా వర్క్ వీసాపై ఉన్నవారు డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో దొరికితే వారి వీసాను రద్దు చేశారు. అమెరికాలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు కాలేజీ మానేసినా, విద్యా సంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్‌కు వెళ్లినా.. అదేపనిగా క్లాసులకు ఎగ్గొడుతూ హాజరుశాతం తక్కువగా ఉన్నా వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించింది.
ఇక, అమెరికన్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోస్టులు పెట్టే అమెరికన్లను సెన్సార్ చేసే విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకొంది. అలాంటి వారికి ఎలాంటి వీసాలు జారీ చేయకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మరోవైపు, అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు నాలుగేండ్ల నివాస కాలపరిమితిని ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చింది. గడువు ముగిసిపోతే, మళ్లీ అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇంకోవైపు, అమెరికాలో పుట్టినవారికి జన్మతః పౌరసత్వం లభిస్తుంది. అయితే, దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో హెచ్1బీ, స్టడీ వీసాలపై అమెరికాకు వెళ్లినవారు, గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు కలవరానికి గురయ్యారు. ట్రంప్ నిర్ణయంపై కోర్టు కేసులు నడుస్తున్నాయి.