ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఎస్ఎస్ రాజమౌళి ‘వారణాసి’ సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన 80 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. మేజర్ ఐమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయింది. హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఈ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దీనికోసం అచ్చంగా కాశీ ఘాట్లనూ, నగరవీధులను పోలినట్లు ఓ భారీ సెట్‌ని నిర్మించారు. కేవలం ఈ సెట్ కోసమే 250కోట్లు వెచ్చించినట్టు వినికిడి. ఇప్పటికే కెన్యాలో జరిగిన భారీ షెడ్యూల్లో అడవుల నేపథ్యంలో వచ్చే అడ్వెంచర్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే అంటార్కిటికా ఖండంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా ‘వారణాసి రికార్డ్ సృష్టించింది.
ఇండియాలోని సహజసిద్ధమైన అటవీప్రాంతమైన ఒడిశాలోనూ ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని, ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ని ఇండియన్ స్క్రీన్ పైకి తీసుకురానున్నది. గ్లోబల్ లొకేషన్స్‌తోపాటు గ్రాండ్ వీఎఫ్ఎక్స్తో విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉండనున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో మహేశ్‌బాబు రుద్రగా, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ ఇండియా రేంజ్లో విడుదలకానున్న ఈ చిత్రానికి కథ, కథనం: వి.విజయేంద్రప్రసాద్, ఎస్ఎస్ కాంచి, సంగీతం: ఎంఎం కీరవాణి, నిర్మాతలు: కేఎల్ నారాయణ, కార్తికేయ.